ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నూతన ప్రజాప్రతినిధులకు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు పాలేరు చెరువు వద్ద పర్యాటక సౌకర్యాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 4 గంటలకు మల్లాయిగూడెంలో, 4.30 గంటలకు గట్టుసింగారంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 6.30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. 7.20 గంటలకు కామంచికల్‌లో పర్యటించనున్నారు.
జల్ మహోత్సవ్‌కు
జిల్లా నుంచి ముగ్గురు
ఖమ్మంఅర్బన్/కల్లూరురూరల్: కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ‘జల్ మహోత్సవ్’ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 12 మంది హాజరు కాగా, అందులో జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, నీటి సంరక్షణలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ ముగ్గురికి అవకాశం దక్కింది. అందులో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, కల్లూరు మండలం చిన్న కోరుకొండి సర్పంచ్ బూదాటి గీతా నారపరెడ్డి, రఘునాథపాలెం మండలం చింతగుర్తికి చెందిన మల్టీపర్పస్ వర్కర్ పెంట్యాల కళావతి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆయిల్‌పామ్‌తో
అధిక ఆదాయం
ఏన్కూరు : ఆయిల్‌పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎం.వి.మధుసూదన్ తెలిపారు. మండలంలోని హిమామ్‌నగర్, తూతకలింగన్నపేట, లచ్చగూడెం గ్రామాల్లో ఉద్యానవన పంటలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం లచ్చగూడెంలో రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వరి వంటి సంప్రదాయ పంటలే కాకుండా తరచూ పంటమార్పిడి పద్ధతి అనుసరించాలని, పామాయిల్‌తో పాటు కూరగాయలు కూడా పండించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ధీర్ఘకాలికంగా ఆదాయంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు అందుతాయని వివరించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి ఆకుల వేణు, ఏఓ నర్సింహరావు పాల్గొన్నారు.
రామయ్యకు
స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా స్వీకరించారు.


