ఆరాతీస్తున్న పోలీసులు..
● వరుసగా చోరీలకు పాల్పడుతున్న దుండగులు ● యూపీ, మహారాష్ట్రకు చెందిన వారని అనుమానాలు
ఖమ్మంక్రైం: కొన్నిరోజులుగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా ముసుగు ధరించిన దొంగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో కళాశాలలు, పాఠశాలలు, ఉన్నత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈ ఘటనలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు సంచారిస్తున్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యూపీ, మహారాష్ట్ర గ్యాంగ్‌లేనా?
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో యూపీ, మహారాష్ట్ర గ్యాంగ్‌లు సంచరిస్తున్నట్లు తెలిసింది. ముసుగులు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా వినూత్నంగా దుస్తులు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు సీసీ పుటేజ్‌లలో పోలీసులు గుర్తించారు. వారి వేషధారణతోపాటు ఇతర సమాచారం మేరకు వారు అక్కడి వారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ తరహా చోరీలు ఎక్కువగా ఈ రాష్ట్రాల ముఠా వారే చేస్తారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతాలను ఎన్నుకొని..
వరుసగా జరుగుతున్న చోరీలకు పాల్పడుతున్న ఇతర రాష్ట్రాల ముఠాలు రైల్వేస్టేషన్ ఉన్న ప్రాంతాలనే ఎక్కువగా ఎన్నుకుంటారని పోలీసులు చెబుతున్నారు. తమ పని సులువుగా చేసుకొని పోవడానికి రైల్వేస్టేషన్ ఉన్న నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాలను ఎంచుకుంటారని, అనంతరం గుర్తింపులు లేని లాడ్జీలు, హోటళ్లలో అద్దెకు దిగుతారని, అనంతరం వారు రద్దీ లేని ప్రాంతాల్లో రెక్కి చేస్తారని తెలిసింది. పోలీస్ పెట్రోలింగ్ తక్కువగా ఉన్న ఏరియాలను చూసుకొని తాళాలు వేసి ఉన్న భవనాలను ఎంపిక చేసుకుని, ముసుగులు ధరించి చోరీలకు పాల్పడి వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయి రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కి ఇతర ప్రాంతాలకు పారిపోతూ ఉంటారని సమాచారం. అయితే, ఈ ముఠాల్లో చాలామంది కరుడుగట్టిన వారు ఉంటారని, ఒక్కోసారి వారు ఇంట్లో వారిపై దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని తెలిసింది.
కొణిజర్ల మండలం విజయ ఇంజనీరింగ్ కళాశాల, వీవీ పాలెం వద్ద ఉన్న ఓ ప్రైవైట్ పాఠశాల, వెలుగుమట్ల గుట్టపై ఉన్న బ్లూ విల్లాస్ సముదాయంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది ఒకటే ముఠా అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ తరహా ముఠాలు ఎక్కడెక్కడ చోరీలకు పాల్పడ్డాయో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లోని పోలీసులతో ఈ ముఠాల కదలికలపై చర్చిస్తున్నట్లు సమాచారం.


