ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షణ
ఏన్కూరు: ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని తిమ్మారావుపేట, ఏన్కూరుల్లో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులను పరిశీలించాక ఆయన ఏఈఓలతో సమావేశమయ్యారు. ఫార్మర్ రిజిస్ట్రీ, పంట వివరాల నమోదుపై సమీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడి ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్‌పై అవగాహన కల్పించారు. వైరా ఏడీఏ టి కరుణశ్రీ, ఏఓ నర్సింహారావు, ఏఈఓ బాలకృష్ణ పాల్గొన్నారు.
ప్రణాళికాయుతంగా
బొగ్గు రవాణా
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం ఓసీల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును ప్రతిరోజు రైలు మార్గం ద్వారా 38వేల టన్నులు, సీహెచ్‌పీకి వాహనాల ద్వారా 16వేల టన్నుల మేర రవాణాకు ప్రణాళిక రూపొందించాలని సింగరేణి డైరెక్టర్(పీఅండ్‌పీ) కె.వెంకటేశ్వర్లు ఆదేశించారు. సత్తుపల్లిలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఆయన బొగ్గు రవాణాపై జీఎంలు మనోహర్, జేవీ.రమణ, సత్తుపల్లి చింతల శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్నందున లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. అంతేకాక ఎప్పటికప్పుడు బొగ్గు రవాణా చేయాలని తెలిపారు. ఈసమావేశంలో అధికారులు బొల్లం శ్రీనివాస్, ప్రహ్లాద్, సునీల్‌వర్మ, బి.రాజేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.
పశు ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం
ఖమ్మంవ్యవసాయం: పశువులకు కావాల్సిన మందుల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ ద్వారా పశు ఔషధ విక్రయ కేంద్రాలు, పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను సహకార సంఘాల ద్వారా స్థాపించేందుకు అనుమతులు జారీ చేయనున్నారు. ఈ కేంద్రాల్లో జనరిక్ పశువైద్య ఔషధాలు అమ్మేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లా కేంద్రంలో ఒకటి, మండలానికి ఒకటి చొప్పున కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉండగా, 120 గజాల సొంత స్థలం లేదా లీజు స్థలం కలిగి ఉండి, ఫార్మసిస్టు పేరు, రిజిస్ట్రేషన్‌తో కూడిన సమ్మతితో పాటు ఔషధ అమ్మకపు లైసెన్సుతో దరఖాస్తు చేసుకోవాలి. డీఏహెచ్‌డీ(జిల్లా పశుసంవర్థక, పశువైద్య శాఖ)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయాన రూ.5 వేలు చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి బి.పురంధర్ సూచించారు.
ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షణ
ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షణ


