సంఘాల పేరుతో రుణ మాయాజాలం?
ఖమ్మంఅర్బన్: ఖమ్మం 4వ డివిజన్ పాండురంగాపురంలో డ్వాక్రా సంఘాల సభ్యుల పేరుతో కొందరు రుణాలు తీసుకుని పక్కదారి పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయాన రుణం తీసుకోకపోయినా బ్యాంకు నోటీసులు అందడంతో నిరుపేద మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పాండురంగాపురానికి చెందిన పేరెల్లి పుష్పలక్ష్మి గ్రూపు సభ్యురాలైనప్పటికీ ఎలాంటి రుణం తీసుకోలేదు. కానీ, ఆమెకు ఇటీవల బ్యాంకు అధికారులు రూ.లక్ష రుణం చెల్లించాలని నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లో చెల్లించకపోతే ఆస్తి జప్తు చేస్తామని రెండో నోటీసు పంపారు. ఈ మేరకు పుష్పలక్ష్మి గ్రామపెద్దలను ఆశ్రయించడంతో రికార్డులు పరిశీలించగా ఆమె రుణం తీసుకున్నట్లు నమోదైంది. అదే ప్రాంతానికి చెందిన ఓ గ్రామదీపిక పది మందితో కొత్త సంఘం ఏర్పాటు చేసి రూ.15 లక్షల రుణం మంజూరు చేయించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం బ్యాంకు అధికారులు సభ్యుల ఖాతాల్లో నగదు జమ చేశాక గ్రామదీపికే డ్రా చేయించి, ఒక్కొక్కరికీ రూ.20 వేలే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఆమె వద్దే ఉంచుకున్నట్లు సమాచారం. కానీ, రికార్డుల ప్రకారం సభ్యులు రూ.1.50 లక్షల చొప్పున రుణం పొందినట్లు ఉండడం, అందరికీ నోటీసులు జారీ కావడంతో లబోదిబోమంటున్నారు. అయితే, ఇది ఒకటి, రెండు సంఘాలకే కాక నాలుగు వీఓల పరిధిలో రూ.కోట్ల మేర అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. ఈ మేరకు గురువారం మెప్మా సీఆర్పీలు సుజాత, సల్మా విచారణకు రాగా, కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి ఆధ్వర్యాన వివరాలు సేకరించారు. సమావేశానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామదీపికలు రాలేదని తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే రుణాలు ఎవరు తీసుకున్నారనేది తేలనుండగా, బ్యాంకర్ల నోటీసులకు ఎవరు బాధ్యులో స్పష్టత రావాల్సి ఉంది.
రూ.లక్షల్లో పక్కదారి పట్టడంపై విచారణ


