గ్రంథాలయ పన్నులపై దృష్టి పెట్టాలి
ఖమ్మంగాంధీచౌక్: వివిధ సంస్థల నుంచి గ్రంథాలయాలకు రావాల్సిన పన్నులపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్‌చార్జ్ డాక్టర్ పి శ్రీజ సూచించారు. ఐడీఓసీలో బుధవారం నిర్వహించిన సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గ్రంథాలయాల నిర్మాణాలు, భవనాల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని చెప్పారు. కాగా, 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ అంచనాల ప్రతిపాదనలను రాష్ట్ర పౌర గ్రంథాలయ సంచాలకులకు పంపించేందుకు సమావేశం అనుమతించింది. కార్యక్రమంలో డీఈఓ చైతన్య జైనీ, డీపీఓ రాంబాబు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కె.కరుణకుమారి, గ్రంథాలయ ఉద్యోగులు భాస్కర్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
సదరమ్ విభాగంలో పరిశీలన..
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పపత్రిలోని సదరమ్ విభాగాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం పరిశీలించారు. కార్యాలయంలోని పలు గదులతో పాటు దివ్యాంగులు కూర్చునేందుకు నిర్మించిన భవనాన్ని తనిఖీ చేశారు. చిన్నచిన్న పనులేమైనా ఉంటే త్వరతగతిన పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట పెద్దాసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్ ఉన్నారు.
దివ్యాంగుల వినతి..
పెద్దాస్పత్రిలో పార్కింగ్ కాంట్రాక్ట్‌ను కొనసాగించేలా చూడాలని స్తంభాద్రి వికలాంగుల సమాఖ్యఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమాఖ్య ద్వారా ఆస్పత్రిలో 17 ఏళ్లుగా పార్కింగ్ నడుపుతున్నామని, దీనిపై 13 మంది ఆధారపడి జీవిస్తున్నామని విన్నవించారు. తమ సమాఖ్య కాంట్రాక్ట్ గడువు తీరిపోతున్నందున టెండర్లు పిలవకుండా తమనే కొనసాగించాలని వేడుకున్నారు. కాగా, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె దివ్యాంగులకు సూచించారు.


