సస్యరక్షణతో చీడపీడల నివారణ
ఇల్లెందురూరల్: మామిడిలో సమగ్ర సస్యరక్షణతో చీడపీడలను నివారించుకోవచ్చని ఇల్లెందు హార్టికల్చర్ అధికారి బి.స్రవంతి సూచించారు. మామిడిలో పూత దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం ఆమె పలు సూచనలు చేశారు. మామిడిలో పూతను కాపాడుకోవడానికి సరైన సమయంలో మందులు పిచికారీ చేయాలని సూచించారు. రసం పీల్చు పురుగు, బూడిద తెగులు నివారణతో మొగ్గలు రావడానికి, అవి విచ్చుకోవడానికి లీటరు నీటికి 2 మి.లీ. మోనోకొటోఫాస్, 3 గ్రాములు వెట్టబుల్ సల్ఫర్, 10 గ్రాములు 19:19:19 కలిపి పిచికారీ చేయాలన్నారు. తెల్లపూత దశలో మందులు పిచికారీ చేయొద్దని, నీటి తడులు అందించొద్దని సూచించారు. పురుగు పూతను గూడుగా ఏర్పర్చుకొని, పూతను తిని పిందెలు ఏర్పడకుండా చేస్తుందన్నారు. ఈ పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పూల గుత్తులపై పిచికారీ చేయాలని చెప్పారు. చల్లని రాత్రులు, వెచ్చని పగటి వాతావరణంలో పువ్వు కాడలపై, పూల మీద తెల్లని పొడ లాంటి బూజు ఏర్పడుతుందని, దీని నివారణకు పూలమొగ్గలు కనిపించిన దశలో లీటరు నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలన్నారు. పూత దశలో బూడిద తెగులు కనిపిస్తే లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మిలీ లేదా ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా డైనోకాప్ 1 మి.లీ చొప్పున కలిపి పూత కాడలు తడిచేలా పిచికారీ చేయాలని సూచించారు. పూత మాడు తెగులు నివారణకు మొగ్గ బయటకు వచ్చే దశలో 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, పచ్చిపూత మీద 1 గ్రాము కార్భండాజిమ్ లేదా 1 గ్రాము ఽథయోఫినైట్ మిథైల్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.


