‘భరోసా’ ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’ ఇంకెప్పుడు?

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

‘భరోసా’ ఇంకెప్పుడు?

‘భరోసా’ ఇంకెప్పుడు?

● చివరి దశకు చేరుతున్న యాసంగి సాగు ● జిల్లాలో 6.74లక్షల ఎకరాల్లో పంటలు ● సాయం కోసం 3.53 లక్షల మంది ఎదురుచూపులు

● చివరి దశకు చేరుతున్న యాసంగి సాగు ● జిల్లాలో 6.74లక్షల ఎకరాల్లో పంటలు ● సాయం కోసం 3.53 లక్షల మంది ఎదురుచూపులు

ఖమ్మంవ్యవసాయం: యాసంగి సీజన్‌ పంటల కాలం చివరి దశకు చేరుతోంది. అయినా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం మాత్రం అన్నదాతలకు అందలేదు. పంటల సాగు మొదలయ్యే సమయంలోనే దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రైతులకు ఉపయోగపడేలా ‘రైతు భరోసా’ పేరిట ప్రభుత్వం సాయం అందించాల్సి ఉంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లో నీరు ఉండగా, యాసంగిలోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన నవంబర్‌ నుంచే సాగు పనులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో అన్నీ కలిపి 4.16లక్షల ఎకరాల్లో, ఉద్యాన పంటలు 2.50లక్షల మేర ఎకాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. వరి ప్రధాన పంట కాగా, మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా అధికంగానే ఉంది.

మొదలైన మొక్కజొన్న కోతలు

యాసంగిలో సాగు చేసిన పంటలు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం సీజన్‌ వాతావరణం పత్తికి అనుకూలించకపోవడమే కాక అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నది. దీంతో పలువురు పంటను తొలగించి మొక్కజొన్న వేశారు. ఈ క్రమాన జిల్లాలో రికార్డు స్థాయిలో 1.70 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, ప్రధాన పంట అయిన వరి 2.50 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం మొక్కజొన్న కోతలు మొదలుకాగా, ముందస్తుగా వేసిన వరి కోత దశకు చేరుకుంది. అంతేకాక అధికారులు యాసంగి ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై దృష్టి సారించారు. అయినా ప్రభుత్వం అందించాల్సిన పెట్టుబడి సాయం రైతుల దరి చేరకపోవడం గమనార్హం.

ఎకరాకు రూ.6వేల చొప్పున..

యాసంగి పంటల పెట్టుబడి సాయం జిల్లాలో దాదాపు 3.53 లక్షల మంది రైతులకు అందాల్సి ఉంది. వీరికి ఎకరాకు రూ. 6 వేల చొప్పున ప్రభుత్వం రూ.436.84 కోట్లు జమ చేయాలి. వీరే కాక నూతనంగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూములు కలిగిన వారు, భూభారతి ద్వారా పట్టాలు పొందిన వారు ఇంకొందరు ఉంటారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో ‘రైతుబంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టి ఏటా రెండు సీజన్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున సాయం అందించేది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ‘రైతుభరోసా’గా పేరు మార్చి ఎకరాకు రూ.6వేల చొప్పున ఇస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలి వానాకాలం సీజన్‌లో మాత్రం పెట్టుబడి సాయాన్ని మాత్రం అందించలేదు. ఆ తర్వాత వానాకాలం సీజన్‌లోనూ పూర్తి స్థాయిలో రైతులకు అందలేదు. గత వానాకాలం సీజన్‌లో మాత్రం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం.. యాసంగి సీజన్‌లో జాప్యం చేస్తుండడం, ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేక రైతులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement