చుట్టాలు వచ్చాయి !
రక్షణపై అటవీ శాఖ దృష్టి
చింతపల్లికి చేరిన సైబీరియా కొంగలు
నాలుగేళ్ల తర్వాత రావడంతో
గ్రామస్తుల ఆనందం
ఖమ్మం వ్యవసాయం/ఖమ్మం రూరల్: జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం చింతపల్లిలో నాలుగేళ్ల తర్వాత అతిథుల సందడి నెలకొంది. ఈ గ్రామానికి సైబీరియా దేశం నుంచి ‘పెయింటెడ్ స్టార్క్’(ఎర్రకాళ్ల కొంగలు) వేల మైళ్ల దూరం దాటి ఏటా వస్తుంటాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి మధ్య కొంగలు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. అయితే, గత నాలుగేళ్లుగా కొంగలు రాకపోగా.. ఈసారి చింతపల్లి పరిసర ప్రాంతాల్లో చెట్లపై ఎర్రకాళ్ల కొంగలు సందడి చేస్తున్నాయి. దీంతో అతిథులను చూసి గ్రామస్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పక్షులు గ్రామంలోని చింతచెట్లు, సర్కారీ తుమ్మచెట్లు, వాటర్ ట్యాంకుపై గూళ్లు కట్టుకొని సంతానోత్పత్తి చేశాక తిరిగి వెళ్లిపోతాయి.
నాలుగేళ్ల తర్వాత సైబీరియా కొంగలు రావడంతో వాటి సంరక్షణపై అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామంలో ఎర్రకాళ్ల కొంగలను చూసేందుకు స్థానికులే కాక వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఇలా వచ్చే వారు పక్షులపై రాళ్లు వేయడం, గూళ్ల నుంచి తరమడం వంటి చర్యలకు పాల్పడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక సెల్ఫీలు దిగడం, గట్టిగా అరవడం చేయొద్దని సూచిస్తున్నారు. అలాగే, కొంగలు ఆవాసం ఏర్పర్చుకున్న చెట్ల కొమ్మలను నరకొద్దని, గుడ్లు కిందపడినా, గాయపడిన పక్షులు కనిపించినా అటవీ ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన కొంగలను అతిథులుగా భావించి కాపాడుకోవడం అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సూచించారు.


