ఆశలు చేజారాయి..
పదవులు గ్యారంటీ అనుకున్నా
తప్పని భంగపాటు
వైరా, మధిరలో చివరి వరకూ ఉత్కంఠ
ఒకే సామాజిక వర్గానికి
ఎక్కువ పదవులపై పార్టీలో చర్చ
వారికే ఐదు పదవులా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్లా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ గెలుపుతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేవు. కానీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారిలో మాత్రం ఒకింత నైరాశ్యం నెలకొంది. పార్టీలో నిబద్ధతతో పనిచేయడమే కాక స్థానికంగా ప్రజాబలం ఉండి, తమకే పదవులు ఖాయమని భావించిన పలువురికి భంగపాటు తప్పలేదు. ప్రధానంగా వైరా, మధిర మున్సిపల్ పీఠాల విషయంలో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. మిగతా మున్సిపాలిటీల్లోనూ వైస్ చైర్మన్ పదవులు ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ఇది కాక ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీల్లో ఒకే కమ్యూనిటీకి ఐదు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టడం పార్టీలోని ఇతర సామాజిక వర్గాల్లో చర్చకు దారి తీసింది.
వైరాలో దక్కని పదవి
వైరా మున్సిపాలిటీలో మెజార్టీ వార్డులను గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ పదవులను కై వసం చేసుకుంది. ఇక్కడ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో బొర్రా ఉమాదేవి, కాపా చంద్రకళ పోటీ పడ్డారు. పార్టీ నిర్ణయమంటూ చైర్‌పర్సన్ పదవిని కాపా చంద్రకళకు, వైస్ చైర్మన్ పదవికి కట్ల సంతోష్‌ను ఖరారు చేశారు. అయితే, వైరా పీఏసీఎస్ చైర్మన్, మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బొర్రా రాజశేఖర్ తన భార్య ఉమాదేవిని చైర్‌పర్సన్ పదవే లక్ష్యంగా పోటీకి దింపారు. చివరి వరకు ప్రయత్నించినా సఫలం కాలేదు. చైర్‌పర్సన్ పీఠాన్ని ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చారని పార్టీ నియోజకవర్గ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ సాగుతోంది.
మధిరలో అనూహ్య మలుపు
మధిర మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నేత వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి భార్య లక్ష్మీ తులసి 6వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. విజేతల్లో 599 ఓట్లతో రెండో అత్యధిక మెజార్టీ ఆమెదే కావడం విశేషం. వేమిరెడ్డి ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి కూడా పోటీ పడినా దక్కకపోవడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ గిరిపై ఆశలు పెట్టుకుని తన భార్యను బరిలోకి దింపారు. పదవి లక్ష్మీతులసికే వస్తుందని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు, బంధువులు ఎన్నిక రోజున భారీ ఎత్తున మధిరకు చేరుకున్నారు. చివరకు సామినేని సుజాతకు పదవి దక్కడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, త్వరలోనే శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ కోటాలో రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా..!
మున్సిపల్, కార్పొరేషన్ పాలకవర్గాలు ఐదేళ్లు కొనసాగనున్నాయి. కానీ మూడేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే వ్యూహాత్మకంగా చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకం జరిగిందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కై వసం చేసుకునేలా ఓటర్లు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీల్లో ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇస్తే.. మిగతా వారిని విస్మరించినట్లేనన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వైస్ చైర్మన్ల ఎంపికలోనైనా బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఇతర సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పురపీఠాలు దక్కని కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం
ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ కలిపి 16 పదవులు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు రిజర్వ్ అయినవి కలుపుకుని మొత్తంగా ఒకే సామాజిక వర్గానికి ఐదు దక్కాయని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ పదవుల్లో కూర్చోవాలని ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలు వారితో పాటు, వారి భార్యను కూడా పోటీ చేయించి గెలిచారు. అయినా పదవులు రాక వారు అసంతృప్తితో ఉన్నారు. ఒకే సామాజిక వర్గానికి ఇన్ని పదవులు ఇచ్చారని గుసగుసలాడుతున్నా ఎక్కడా బహిరంగంగా అసంతృప్తి మాత్రం వెళ్లగక్కడం లేదు.


