చివరి వరకూ ఉత్కంఠే..
సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగినట్లు తెలిసింది. ఈ విషయమై ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చర్చలు జరిగినట్లు సమాచారం. మొదట్లో తోట సుజలరాణి, ఎండీ.రెహనాబేగం మధ్య పోటీ ఉండగా, చివరకు బొంతు సుమలత, రెహానాబేగంలో ఒకరిని ఎంపిక చేయాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ క్యాంప్‌లో ఈ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యే మధ్య అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినట్లు సమాచారం.
ఏపీ ముఖ్యనేత సిఫారసు?
బొంతు సుమలతకు మద్దతుగా ఏపీకి చెందిన ముఖ్యనేత ఒకరు ఇక్కడ అధికార పార్టీలో ముఖ్యనేతకు సిఫారసు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో సుమలత పేరు దాదాపు ఖరారైనట్టేనని చెప్పుకున్నారు. అయితే, సుమలత సామాజిక వర్గానికే చెందిన నేతలకు మధిర, వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు దక్కడం.. ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో ఎక్కడా అవకాశం లేకపోవడంతో సర్దిచెప్పి చివరకు రెహానాబేగంను ఎంపిక చేశారు. కాగా, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కుటుంబం వెంట నడుస్తున్న ఎండీ.కమల్‌పాషా సతీమణి రెహానాబేగంను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడం విధేయతకు పట్టం కట్టినట్లేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి దయానంద్‌తో కమల్‌పాషా కొనసాగుతున్నారు. చైర్మన్ స్థానం బీసీ జనరల్ అయితే ఆయనకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగినా జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్యను ఎంపిక చేశారు. కాగా, మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ప్రవేశం ఉంటుందని అధికారులు ముందుగా చెప్పినా గేటు వద్దే నిలిపివేశారు. దీంతో నిరసన తెలపడంతో సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్ నలుగురినే అనుతిస్తామని, అది కూడా సెల్‌ఫోన్లు లేకుండా రావాలని సూచించారు. ఈమేరకు మీడియా ప్రతినిధులు లోనకు వెళ్లలేదు. ఇదేసమయాన అధికార పార్టీ నేతలను లోపల చర్చలకు అనుమతించడంపై జర్నలిస్టు సంఘాల నేతలు అభ్యంతరం తెలిపారు.
సత్తుపల్లి చైర్‌పర్సన్ ఎంపికపై చర్చలు


