ఫిర్యాదులు పెండింగ్ ఉండొద్దు
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులతో సమీక్షించారు. అధికారులపై నమ్మకంతో ప్రజలు వస్తారని, వారి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తే ఆ నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఏవైనా దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేయాలని సూచించారు. ఆతర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ అమలు, పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికపై సూచనల చేశారు.
● వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ గతనెల 31న ఉద్యోగ విరమణ చెందిన ఏడుగురు ఉద్యోగులను కలెక్టర్ అనుదీప్ సత్కరించారు. అనంతరం వారి సేవలను కొనియాడారు.
● జిల్లాలోని అభివృద్ధి పనుల పురోగతికి అధికారులు ప్రణాళికాయుతంగా పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ప్రాజెక్టుల భూసేకరణ, రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, సింథటిక్ ట్రాక్, రోప్ వే పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించారు.సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేటి రిటైనింగ్ వాల్‌కు అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జూన్‌కల్లా పూర్తయ్యేలా వేగం పెంచాలని తెలిపారు. అలాగే, ఎన్నెస్పీ భూములకు ఫెన్సింగ్, ఫ్రూట్ మార్కెట్‌కు భూకేటాయింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, డీఎంహెచ్‌ఓ రామారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీలత, ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, యాకూబ్, వెంకటరెడ్డి, రంజిత్, ఎస్‌డీసీ రాజేశ్వరి, డీఈఓ చైతన్య జైనీ, ఆర్‌డీఓ నర్సింహారావు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ధాన్యం సేకరణ, యూరియా పంపిణీ, మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించిన ఆయన ధాన్యం దిగుబడి అంచనాకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అలాగే, యాప్ ద్వారా యూరియా పంపిణీపై నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది మినహాయింపునకు అధికారులు సిఫారసు చేస్తే ప్రత్యామ్నాయ సిబ్బందిని కూడా వారే సూచించాలని తెలిపారు. కాగా, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో షాపులు కోల్పోయిన వారికి స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, జిల్లా అధికారులు పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ భోజన నాణ్యత పరిశీలించాలని సూచించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


