105 మంది చిన్నారులకు విముక్తి
ఖమ్మంక్రైం: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపే లక్ష్యంగా నెల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–12 ద్వారా 105 మంది చిన్నారులకు విముక్తి కల్పించామని, ఇందులో 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. గతనెల 1నుంచి 31వ తేదీ వరకు నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ సాంబరాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో పోలీసు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, కార్మిక, విద్య, ఆరోగ్య శాఖలే కాక చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్‌జీఓలు పాల్గొన్నారని వెల్లడించారు. ఈమేరకు రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలపై దృష్టి సారించి చిన్నారులకు విముక్తి కల్పించామని తెలిపారు. చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖ కవళికలను గుర్తించే దర్పణ్ పరిజ్ఞానం ఆధారంగా పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారని వెల్లడించారు. ఒక్కో డివిజన్‌లో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లుతో కూడిన బృందాలు పాల్గొనగా సీపీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
18మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి
ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధి వివిధ స్టేషన్లలో కానిస్టే బుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న 18మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా వీరిని సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ అభినందించారు. పదోన్నతి పొందిన వారిలో ఖమ్మం జిల్లాకు ఒకరిని కేటాయించగా, వరంగల్ జిల్లాకు నలుగురు, మహబూబాబాద్ జిల్లాకు ముగ్గురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పది మందిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీస్ కమిషనర్ సునీల్‌దత్


