రూ.10లక్షల్లో వచ్చింది రూ.50వేలే
విద్యాశాఖ ఉద్యోగుల పట్టింపులేని తనంపై విమర్శలు మొత్తం వసూలైతే క్రీడలకు నిధులు ఫుల్
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల బాధ్యులు ఏటా క్రీడా రుసుము చెల్లించాల్సిన ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా క్రీడాపోటీల నిర్వహణకు నిధులు లేక దాతలపై ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. క్రీడాభివృద్ధి కోసం విద్యాశాఖ నిధులు కేటాయించకపోగా పాఠశాలల నుంచి రుసుము వసూళ్లలోనూ పట్టింపు లేని ధోరణి ప్రదర్శిస్తుండడంతో క్రీడాభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రతీ విద్యార్థి నుంచి రూ.15
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 6నుంచి 9వ తరగతి విద్యార్థులను క్రీడా రుసుముగా రూ.15 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో రూ.10లక్షలు వసూలు కావాల్సి ఉన్నా ఇప్పటికే రూ.50 వేలే రావడం గమనార్హం. మిగిలిన నిధులు చెల్లించడంలో పాఠశాలల యాజమాన్యాలు, బాధ్యులు పట్టించుకోకపోగా అధికారులు సైతం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి నిర్ణీత రుసుము వసూలయ్యే అవకాశమున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదని వాపోతున్నారు.
నిధులకు కటకట
జిల్లావ్యాప్తంగా జరగాల్సిన పాఠశాలల స్థాయి క్రీడాపోటీలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఔత్సాహిక క్రీడాకారులను వెలికితీసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరతేనని తెలుస్తోంది. తొలుత మండలం, ఆపై జోనల్‌స్థాయిలో పోటీలు నిర్వహించాక జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ మండలస్థాయి పోటీల తర్వాత జిల్లాస్థాయిలో కొన్ని క్రీడాంశాల్లోనే పోటీలు నిర్వహించిన పాఠశాలల క్రీడా సంఘం బాధ్యులు తమ పని కానిచ్చేశారు. ఇదేమిటని ఆరా తీస్తే నిధుల కొరత తామేం చేయలేని పరిస్థితి ఉందని, తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు చెప్పినట్లు తెలిసింది.
ప్రైవేటు పాఠశాలలే అధికం
జిల్లాలో లెక్కకు మిక్కిలిగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో చదివే విద్యార్థుల నుంచి రూ.15వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాకున్నా యాజమాన్యాల నిరాసక్తతతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ఫలితంగా జిల్లాస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి టోర్నీలకు పంపించలేకపోతున్నామని సంఘం బాధ్యులు చెబుతున్నారు. దాదాపు 37 క్రీడాంశాల్లో జిల్లా జట్లను ఎంపిక చేసినా వీరందరినీ రాష్ట్ర పోటీలకు పంపేందుకు సరిపడా నిధులు లేక దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. విద్యాశాఖ అధికారులు చొరవ చూపి విద్యాసంవత్సరం ఆరంభంలో క్రీడా రుసుము వసూలు చేయగలిగితే పోటీల నిర్వహణ, రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులను తీసుకెళ్లడం సులువవుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చేసరికి బడి నిర్వహణకే నిధులు లేనందున క్రీడా రుసుము చెల్లించలేమని కొందరు హెచ్‌ఎంలు విద్యాశాఖ అధికారులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇకనైనా అధికారులు చొరవ చూపి సకాలంలో రుసుము చెల్లించేలా సూచనలు చేస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మేలు చేసినట్లవుతుంది.
పాఠశాలల క్రీడా రుసుము చెల్లింపులో నిర్లక్ష్యం
రూ.10లక్షల్లో వచ్చింది రూ.50వేలే


