●యూరియా కోసం అవే తిప్పలు
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో మొక్కజొన్న, వరి, ఇతరత్రా కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరిపడా సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడడం ఇందుకు కారణమవుతోంది. మండలంలోని మంచుకొండ, వీవీ.పాలెం, రఘునాథపాలెం పీఏసీఎస్‌ల పరిధిలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన యూరియా కూపన్లు జారీ చేశారు. వీటి ఆధారంగా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు ఇచ్చినా ఇక్కట్లు తప్పలేదు. మంచుకొండ పీఏసీఎస్ పరిధి రైతులు పెద్దసంఖ్యలో రావడం, 445 బస్తాల యూరియా మాత్రమే ఉండడంతో పోటీ పడ్డారు. యూరియా అందని వారికి రఘునాథపాలెం పీఏసీఎస్ పరిధి ఈర్లపూడి సెంటర్‌లో సరఫరా చేస్తామని ఏఓ కె.ఉమామహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అవసరం మేర నిల్వలు రానున్నందున రైతులు ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.


