రైలు ఢీకొని వ్యక్తి మృతి
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం రైల్వేగేట్ సమీపాన బుధవారం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. చింతకాని గ్రామానికి చెందిన ఇట్టా కనకయ్య (50) పనుల కోసం వెళ్తుండగా ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. ఘటనలో ఆయన తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. తొలుత ఆనవాళ్లు తెలియకపోగా, ఆతర్వాత స్థానికులు పరిశీలించి మృతుడిని కనకయ్యగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించినట్లు జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు వెల్లడించారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి...
వైరారూరల్: వైరా మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఓ యువకుడు మృతి చెందాడు. తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన మండె నాగరాజు (28), నర్రావుల శ్రీకాంత్ వైరా వచ్చి స్వగ్రామానికి వెళ్తున్నారు. శ్రీకాంత్ వాహనం నడుపుతున్నాడు. స్టేజీ పినపాక సమీపాన బైక్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో నాగరాజుకు తీవ్ర గాయాలు కాగా.. శ్రీకాంత్ ఎడమ చేతికి గాయమైంది. వీరిని 108 వాహనంలో ఖమ్మం ఆస్పపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు..
కూసుమంచి: మండలంలోని పాలేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎడవెల్లి రాంరెడ్డి (55) బుధవారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఆయన తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై అదే గ్రామంలో మరోచోట ఉంటున్న తండ్రి వద్దకు వెళ్తున్నాడు. నాయకన్‌గూడెం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించేలోగా రాంరెడ్డి మృతి చెందారు. కాగా, రాంరెడ్డి మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన నిబద్ధతతో పనిచేశారని, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాలేరు ఏకగ్రీవమయ్యేలా కృషిచేశారని గుర్తు చేశారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కూడా సంతాపం ప్రకటించారు.
లారీ ఢీకొని వ్యక్తి..
సత్తుపల్లిటౌన్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన తోట వరప్రసాద్(48) సత్తుపల్లిలో బొగ్గు లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కిష్టారం సమీపంలో రోడ్డు దాటుతుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు.
రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు
చింతకాని: చింతకాని రైల్వేస్టేషన్ సమీపాన బుధవారం రైలు నుంచి జారిపడిన యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న విష్ణువర్దన్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామమైన పెనుబల్లి మండలం కరాలపాడు వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ఖమ్మం చేరుకున్న ఆయన అదే మార్గంలో వెళ్తుందని విజయవాడ వైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు తెలుస్తోంది. కాసేపయ్యాక గుర్తించిన ఆయన దిగే క్రమాన జారి పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనలో విష్ణువర్దన్‌కు రెండు కాళ్లు, ఎడమ చేయి విరగగా 108 వాహనంలో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు.


