నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను మంత్రి సన్మానిస్తారని క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఖమ్మంలో మంత్రి తుమ్మల..
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం 14వ డివిజన్ గోపాలపురంలో సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత మరికొన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
కోర్టు భవన స్థలం పరిశీలించిన జిల్లా జడ్జి
రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని జింకల తండా రోడ్డులో జిల్లా కోర్టుల భవన నిర్మాణాల కోసం కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని బుధవారం జిల్లా జడ్జి రాజగోపాల్ పరిశీలించారు. ఈమేరకు భూమి వివరాలు, హద్దులను తహసీల్దార్ శ్వేత, సర్వేయర్ శివ, ఆర్‌ఐ ప్రవీణ్ ఆయనకు వివరించారు. స్వామి నారాయణన్ పాఠశాలకు కేటాయించిన భూమిని ఆనుకుని భూమిని కోర్టు నిర్మాణానికి అనువుగా గుర్తించి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే, కోర్టుల సముదాయంతో పాటు ఉద్యోగుల క్వార్టర్ల కోసం మరో ఐదు ఎకరాలు కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చర్చ జరిగనట్లు సమాచారం. ప్రస్తుతం కోర్టు సముదాయం నిర్మాణం పూర్తయితే జిల్లా న్యాయ వ్యవస్థకు మరింత బలో పేతం కానుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
ముస్తాబవుతున్న భద్రగిరి
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు సెంటర్‌లో ప్రధాన స్వాగత ద్వారం, అభయాంజనేయస్వామి, సూపర్‌మార్కెట్ సెంటర్‌లతో పాటు ఇతర కూడళ్లలో సైతం స్వాగత ద్వారాలు సిద్ధమయ్యాయి. ఈనెల 29వ తేదీ రాత్రి గోదావరిలో తెప్పోత్సవం కోసం వినియోగించే తాత్కాలిక ర్యాంపు నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు తగు సూచనలు చేశారు.
ఆన్‌లైన్‌లో 719 టికెట్ల విక్రయం..
కాగా ఉత్తరద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో 719 టికెట్లను విక్రయించారు. రూ.2వేల విలువగల సెక్టార్ టికెట్లు 353, రూ.1000 విలువైన టికెట్లు 52, రూ.500 విలువైన సెక్టార్ బీ, డీ టికెట్లు 416, రూ.250 విలువైన టికెట్లు 300 ఖాళీగా ఉన్నాయని, వీటిని భక్తులు వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.


