కాంగ్రెస్.. తీన్‌మార్ !
ఏకగ్రీవాలు సహా 372 సర్పంచ్ స్థానాలు ‘హస్తం’ కై వసం
121 స్థానాలను దక్కించుకున్న
బీఆర్‌ఎస్
సీపీఎంకు 25, సీపీఐకి 11,
ఇతరులకు 36 స్థానాలు
మూడు విడతల్లో నియోజకవర్గాల వారీగా జీపీల ఫలితాలు (ఏకగ్రీవాలు)
మంత్రుల ఇలాకాల్లో దూసుకెళ్లి..
తుది విడతలోనూ కాంగ్రెస్ హవా
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. మెజార్టీ సర్పంచ్ స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులు కై వసం
చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి. మూడు విడతలు కలిపి 566
గ్రామపంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఏన్కూరు మండలం నూకాలంపాడు పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయినా అక్కడ ఎస్టీ అభ్యర్థి
లేకపోవడంతో ఎన్నిక జరగలేదు. మిగిలిన 565 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఇందులో
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 372 సర్పంచ్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత
బీఆర్‌ఎస్ మద్దతుదారులు 121 పంచాయతీలు, సీపీఎం 25, సీపీఐ 11, ఇతరులు 36 స్థానాల్లో గెలుపొందారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడదతో కాంగ్రెస్ పార్టీ
పలు పంచాయతీలను కోల్పోయింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఏకగ్రీవాలతో బోణీ కొట్టి..
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిందే తరువాయి ఏకగ్రీవాలతోనే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయపరంపర మొదలుపెట్టారు. పార్టీ అధికారంలో ఉండడం, స్థానికంగా ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వారే కావడంతో ఎన్నికలు జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులకు తిరుగులేకుండా పోయింది. ఇదే మయాన బీఆర్‌ఎస్, సీపీఎం జిల్లాలో మెజార్టీ పంచాయతీల్లో పొత్తుతో ముందుకెళ్లి కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చాయి. అయినా కాంగ్రెస్ మద్దతుదారులు కల్లూరు మండలం మినహా ప్రతీ మండలంలోనూ మెజార్టీ పంచాయతీల్లో పాగా వేశారు. ఏకగ్రీవాలతో మొదలైన ఆ పార్టీ జైత్రయాత్ర మూడో విడత ముగిసే వరకు కొనసాగింది.
పొత్తుతో ఆ రెండు పార్టీలు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఎం అవగాహనతో పోటీ చేశాయి. ఆ పార్టీల మద్దతుదారులు పలు స్థానాల్లో గెలుపొందగా, కొన్నిచోట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. మధిర నియోజకవర్గంలోని 34 పంచాయతీల్లో, పాలేరులోని 42 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఇక ఖమ్మం నియోజకవర్గ పరిధి రఘునాథపాలెంలో బీఆర్‌ఎస్ 11 స్థానాల్లో గెలిచింది. నామినేషన్ల ముందు వరకు బీఆర్‌ఎస్, సీపీఎం ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రాధాన్యతను ఇచ్చాయి. పలుమార్లు చర్చల అనంతరం కలిసి పోటీ చేయడంతో అనుకున్న దాని కన్నా ఎక్కువ స్థానాలు దక్కించుకోగలిగారనే చర్చ సాగుతోంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల విజయ పరంపర కొనసాగింది. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, ఏన్కూరు, సింగరేణి మండలాల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగిన పంచాయతీలు కలిపి 190 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 119 జీపీల్లో గెలుపొందింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్ 45గ్రామపంచాయతీలను గెలుచుకోగా, సీపీఎం రెండు, సీపీఐ ఒక చోట విజయం సాధించాయి. ఇక ఇతరులు 23పంచాయతీలను దక్కించుకున్నారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గంలోని పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఆ పార్టీ రెబల్స్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈక్రమాన రెబల్స్ పలు జీపీల్లో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు కూడా పోటీ ఇచ్చారు. కల్లూరు మండలంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కన్నా ఎక్కువ స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక పెనుబల్లి, వేంసూరు మండలాల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు మెజార్టీ పంచాయతీలు దక్కించుకున్నా.. బీఆర్‌ఎస్ మద్దతుదారులు సైతం సత్తా చాటారు. తల్లాడ, పెనుబల్లి మేజర్ పంచాయతీలను బీఆర్‌ఎస్ దక్కించుకోగా, వేంసూరు, వీఎం బంజర మేజర్ పంచాయతీ కాంగ్రెస్ పరమైంది.
సత్తుపల్లి నియోజకవర్గంలో రెబల్స్ బెడద
మూడు విడతల్లోనూ అధికార పార్టీ ఆధిక్యత
నియోజకవర్గం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ సీపీఎం సీపీఐ ఇతరులు
మధిర 131 90 21 13 05 02
పాలేరు 134 83 34 08 03 06
ఖమ్మం 37 26 11 0 0 0
సత్తుపల్లి 129 72 40 02 0 15
వైరా 110 85 09 02 02 12
(జూలూరుపాడు మినహా)
ఇల్లెందు 24 16 06 00 01 01
(కామేపల్లి మాత్రమే)
మొత్తం 565 372 121 25 11 36
పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన మెజార్టీ సాధించారు. జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో విజయపరంపర కొనసాగింది. మొదటి, రెండు విడతల్లో ఈ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు కాంగ్రెస్‌కు జై కొట్టారు. మధిర నియోజకవర్గంలో మొత్తం 131 జీపీలకు 90చోట్ల ఆ పార్టీ మద్దతుదారులు నెగ్గారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలో 134 జీపీలకు 83లో, ఖమ్మం నియోజకవర్గంలో 37 జీపీలకు 26 గ్రామపంచాయతీల్లో విజయబావుటా ఎగురవేశారు. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్ మద్దతుదారుల పక్షాన నిలిచారు. మరికొన్ని చోట్ల స్థానికంగా పార్టీలో శ్రేణుల్లో విభేదాలు, టికెట్ రాలేదనే ఉద్దేశంతో పనిచేయకపోవడంతో కొన్ని స్థానాలను కోల్పోయింది.
కాంగ్రెస్.. తీన్‌మార్ !
కాంగ్రెస్.. తీన్‌మార్ !
కాంగ్రెస్.. తీన్‌మార్ !


