లేవు పనులు..
ఉపాధి లభిస్తుంది..
ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి..
ఉన్నాయి
నిధులు..
కూసుమంచి: జిల్లాలోనే పాలేరు రిజర్వాయర్‌కు ఎంతో గుర్తింపు ఉంది. కొన్నేళ్ల కిందట ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా పార్క్‌లు ఏర్పాటు చేసి పర్యాటకులు సేద తీరేలా వసతులు కల్పించారు. కానీ, దశాబ్ద కాలం నుంచి నిర్వహణ, నిధులు లేక పార్కులు కళావిహీనంగా మారాయి. అంతేకాక రిజర్వాయర్‌లో బోటింగ్ మూలన పడింది. దీంతో పాలేరుకు పర్యాటకులు దూరం కాగా పలువురు జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఒకప్పుడు పాలేరు రిజర్వాయర్ ప్రాంతం పచ్చిక బయళ్లు, పూల తోటలతో ఆహ్లాదాన్ని పంచేది. రానురాను ఆ పరిస్థితి లేకపోవడం, బోటింగ్ నిలిచిపోవడంతో పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో కొన్నేళ్ల క్రితం పండుగలు, సెలవు దినాల్లో రద్దీగా ఉండే ప్రాంతం ఇప్పుడు బోసిపోతోంది. అంతేకాక పర్యాటకులపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోయి ప్రత్యమ్నాయ పనులు వెతుక్కోవాల్సి వచ్చింది.
అభివృద్ధికి రూ.5 కోట్లు..
పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పాలేరు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ నుంచి పాలేరు పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ గత ఏడాది నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఏడాది కావస్తున్నా నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
పనులు ప్రారంభిస్తే మహర్దశ..
పాలేరు పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన రూ.5 కోట్ల నిధులతో కొత్త అందాలు చేరతాయని ప్రకటించారు. పార్కులను అభివృద్ధి పర్చటం, గ్రీనరీని పెంపొందించటంతో పాటు పర్యాటకుల విశ్రాంతి నిమిత్తం వెదురుతో కాటేజీలు, రెస్టారెంట్లు నిర్మిస్తామని తెలిపారు. అంతేకాక పార్కుల్లో ఆకర్షణీయంగా ఫౌంటెన్‌లు, లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. పర్యాటకుల పార్టీ బోటింగ్ కోసం 60 సీట్ల లాంచీని, మరి కొన్ని స్పీడ్ బోట్లు, పెడల్ బోట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చి పనులు పూర్తయితే జిల్లా వాసులకు కొత్త పర్యాటక కేంద్రం అందుబాటులోకి వస్తుంది. అంతేకాక అటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరి.. ఇటు స్థానికులకు ఉపాధి లభించనుంది.
మేం కొన్నెళ్లుగా పాలేరు రిజర్వాయర్‌లో బోట్లు నడిపాం. రానురాను పర్యాటకులు లేక మేం కూడా ఉపాధి కోల్పోయాం. పార్కులను, బోటింగ్‌ను అభివృద్ధి చేస్తే మళ్లీ మాకు ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఈ పనులు పూర్తిచేస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది.
–బత్తుల ఉప్పయ్య, బోట్ రైడర్, పాలేరు
రిజర్వాయర్ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే పనులు ప్రారంభించి పార్కులను అభివృద్ధి చేస్తాం. తద్వారా రానున్న రోజుల్లో పర్యాటక ప్రాంతంగా కళకళలాడుతుంది.
–సుమన్‌చక్రవర్తి, జిల్లా పర్యాటకశాఖ అధికారి
లేవు పనులు..
లేవు పనులు..


