విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కై కొండాయిగూడెంనకు చెందిన తూము గోపి (24) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ నేతృత్వాన గోపి విద్యుత్ మరమ్మతులు చేయడానికి వెళ్లాడు. ముందుగానే ఎల్‌సీ తీసుకున్నప్పటికీ పని మధ్యలో స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో గోపిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, కాంట్రాక్టర్, లైన్‌మెన్ నిర్లక్ష్యంతోనే గోపి మృతి చెందాడని ఆయన భార్య యమున ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
‘భగీరథ’కార్మికుడు ఆత్మహత్య
రఘునాథపాలెం:కడుపునొప్పితో బాధపడుతున్న మిష న్ భగీరథ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని వీ.వీ.పాలెంనకు చెందిన తగ రం నాగరాజు (36) మిషన్ భగీరథలో ఔట్‌సోర్సింగ్ విధానంపై కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన చికిత్స చేయించుకున్నా ఫలితం లేక శనివారం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేశారు. ఘటనపై భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
ఇద్దరు వ్యక్తులకు గాయాలు
వేంసూరు: ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తుపల్లి డిపోకు చెందిన బస్సు సత్తుపల్లి నుంచి వేంసూరు మండలం భీమవరం మీదుగా తిరువూరు వెళ్తోంది. ఈ క్రమాన మర్లపాడు రింగ్ సెంటర్ వద్ద మలుపు తిరుగుతుండగా సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు వేంసూరు ఎస్‌ఐ కవిత తెలిపారు.


