బకాయిలు బారెడు..
భారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్,
స్కాలర్‌షిప్ బకాయిలు
జిల్లాకు రూ.202 కోట్లకు పైగానే బాకీ
రేపటి నుంచి విద్యాసంస్థల బంద్‌కు యాజమాన్యాల నిర్ణయం
ఉధృతమవుతున్న విద్యార్థి సంఘాల ఉద్యమాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉన్నత విద్య అభ్యసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీంతో అటు విద్యార్థులు, ఇటు విద్యాసంస్థల యజమానులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు పేరుకుపోయాయని చెబుతూ కొన్ని సంస్థలు విద్యార్థులే ఫీజు చెల్లించాలని చెబుతుండగా.. ఇంకొన్ని చోట్ల కోర్సులు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యాన కలిపి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యాసంస్థలకు రూ.144.30 కోట్లు అందాల్సి ఉంటుంది. అంతేకాక పేద విద్యార్థులకు ఉపకారవేతన బకాయిలు రూ.58.46 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంగా జిల్లాకు రావాల్సిన నిధులు రూ.202.76 కోట్లకు చేరడం గమనార్హం.
సర్టిఫికెట్ల నిలిపివేత..
బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యంతో విద్యా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీని ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ రానందున చదువు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేశాయి. తద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగ దరఖాస్తుకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అంతేకాక ఉపకార వేతనాలు సమయానికి అందక పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు కొనసాగించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంద్‌కు పిలుపు
బకాయిలు విడుదల చేయాలని పలుమార్లు కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యాసంస్థల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈమేరకు 3వ తేదీ నుంచి విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. బకాయిలను విడుదల చేసే వరకు తరగతులు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. మరోవైపు విద్యార్థి సంఘాలు సైతం ఈ విషయంలో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. తక్షణమే బకాయిలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


