ముంపు ప్రాంతాల్లో శాశ్వత చర్యలు
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటన
మధిర: భారీ వర్షాల సమయాన నీరు చేరుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపడుతామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మధిరలో శనివారం పర్యటించిన ఆయన ముంపు ప్రాంతాలైన హనుమాన్, ముస్లిం కాలనీలను అధికా రులతో కలిసి పరిశీలించారు. వరద ముంపునకు శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. స్టామ్ వాటర్ డ్రెయిన్లు, రోడ్ల వెడల్పు పెంచేలా ప్రజలు సహకరిస్తే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిధులు మంజూరు చేస్తారని తెలిపా రు. అనంతరం మధిర మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. మధిర పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలకు వరద చేరుతున్నందున నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు, చెత్త సేకరణపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డీఈ నాగబ్రహ్మం, ఆర్ అండ్ బీ డీఈ శంకర్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ నాయకులు మల్లాది వాసు, మిర్యాల రమణగుప్త, బాజీ తది తరులు కలెక్టర్‌ను కలిసి సమస్యలపై చర్చించారు.
తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు
ఖమ్మం సహకారనగర్: క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రతిబింబించేలా తుపాన్ నష్టంపై నివేదిక రూపొందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎక్కడా తప్పు జరగకుండా నష్టంపై నివేదికలు తయారుచేయాలని, ఏ పొరపాటు జరిగినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
6లోగా నష్టం నివేదికలు
తుపాన్ నష్టం వివరాల నివేదికను ఈనెల 6వ తేదీలోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె సమీక్షించారు. పంట నష్టం వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని, ఇందుకోసం వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని తెలిపారు. అలాగే, రోడ్ల ధ్వంసంపై పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులు నివేదిక సిద్ధం చేయాలని, జలవనరుల శాఖ, విద్యుత్ అధికారులు కూడా వారి పరిధిలో నష్టంపై అంచనాలు రూపొందించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లు అందుబాటులో ఉన్న నిధులతో తాత్కాలిక మరమ్మతు చేయించాలని సూచించారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, సీపీఓ ఏ.శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, యాకూబ్, వెంకట్‌రెడ్డి, చందన్‌కుమార్, పుల్లయ్య, ఆశాలత, అలీమ్, సరిత, రామారావు పాల్గొన్నారు.


