62వేల ఎకరాల్లో పంట నష్టం
● నేటి నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ● జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య
నేలకొండపల్లి: జిల్లాలో ఇటీవల తుపాన్‌తో వరి, మిర్చి, పత్తి తదితర పంటలకు 62 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని బోదులబండ, చెన్నారం, మోటాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను శనివారం సందర్శించిన ఆయన రికార్డులు తనిఖీ చేశారు. అలాగే, పలుచోట్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించాక మండ్రాజుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని రకాల పంటలకు 62 వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేయగా, కనీసం 33 శాతానికి పైగా పంట దెబ్బతింటేనే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందుతుందని తెలిపారు. కాగా, పంటలు తడిసిన నేపథ్యాన రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచించారు. కాగా, జిల్లాలో 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన రైతులు తొందరపడి దళారులను ఆశ్రయించొద్దని తెలిపారు. అలాగే, ఇటీవల దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినందున అన్నదాతలు ఆందోళన చెందొద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి ఎం.రాధ, ఏఈఓలు అవినాష్, అరవింద్, సొసైటీ సీఈవో జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధు పోర్టల్‌లో నమోదు
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ శాఖ రూపొందించిన రైతుబంధు పోర్టల్(యాప్)లో పంట నష్టం వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించారు. ఈ పోర్టల్‌లో ఈ–క్రాప్ ప్రొఫార్మా ఉండగా.. ఇటీవల చేపట్టిన పంటల నమోదులో వెల్లడైన రైతులు, పంటల వివరాలే కాక సర్వే నంబర్లు, విస్తీర్ణం నమోదై ఉంటాయి. ఈమేరకు ఆదివారం నుంచి ఏఈఓలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ ఫొటోలు తీసి గతంలో ఉన్న వివరాల ఆధారంగా పంట నష్టాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని ప్రకటించగా.. 33 శాతం, ఆపైన నష్టం జరిగిన పంటలనే పరిగణనలోకి తీసుకుంటారు.


