27ఏళ్ల తర్వాత రూ.2.81 లక్షల పరిహారం
నేలకొండపల్లి: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 27ఏళ్ల తర్వాత ప్రమాద మృతుడి కుటుంబానికి కార్మిక శాఖ నుంచి పరిహారం అందింది. దీంతో తరచుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవిస్తూ ఎదురుచూసిన ఆ వ్యక్తి కుటుంబం వ్యథ తీరినట్లయింది. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంకు చెందిన కొత్తపల్లి వెంకటేశ్వరరావు 27 ఏళ్ల క్రితం ఖమ్మం రూరల్ మండలంలోని వెంకటగిరి సమీపాన ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందాడు. ఆయనకు కార్మిక శాఖ బీమా పథకంలో సభ్యత్వం ఉండడంతో కుటుంబీకులు పరిహారం కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రకరకాల కారణాలతో పరిహారం చెల్లింపులో ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు కుటుంబీకులు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరాలేదు. ఇటీవల స్థానిక నాయకులు చొరవ తీసుకుని మంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.2,81,321 పరిహారం మంజూరు చేశారు. ఈమేరకు చెక్కులను ఆయన తల్లి భద్రమ్మ, భార్యకు శనివారం కార్మిక శాఖ అధికారి కృష్ణవేణి అందజేశారు. దీంతో పరిహారం రాదని ఆశలు వదిలేసుకున్న వారు అధికారులు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షేక్ జహీరాబీ, నాయకులు బచ్చలకూరి నాగరాజు, కొత్తపల్లి సుబ్బారావు, బచ్చలకూరి ఉదయ్, ప్రతాప్, కొత్తపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.


