
చేప పిల్లల పంపిణీకి సిద్ధం
● జిల్లాలో 882 జలాశయాల గుర్తింపు ● 3.48 కోట్ల పిల్లల విడుదలకు ఏర్పాట్లు
ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు ఉచిత చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధమైంది. ఆగస్టు ఆరంభం నుంచే కసరత్తు చేస్తుండగా వివిధ కారణాలతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు సెప్టెంబర్ చివరి వారంలో కాంట్రాక్టర్లు పాల్గొనగా టెండర్లు ఖరారు చేశారు. ఈమేరకు జిల్లాలోని 882 జలాశయాల్లో చేపపిల్లల విడుదలకు ముగ్గురు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. మొత్తం 3.48 కోట్ల చేపపిల్లలను విడుదల చేయనున్నారు. ఇందులో 80–100 మి.మీ.ల చేప పిల్లలు 2.16 కోట్లు, 35–40 మి.మీ. పొడవైనవి 1.32 కోట్లు ఉంటాయి. పెద్ద చేప పిల్లకు రూ.1.70, చిన్న చేపలకు 68 పైసలను కాంట్రాక్టర్లకు చెల్లించేలా ధర ఖరారైంది. మొత్తంగా ప్రభుత్వం జిల్లాకు రూ.4.42 కోట్లు కేటాయించగా, విడుదల చేసే చేపపిల్లల్లో బొచ్చ, రవ్వు, బంగారుతీగ, మోసు తదితర రకాలు ఉన్నాయి.
త్వరలోనే విడుదల
టెండర్లు ఖరారైన నేపథ్యాన జిల్లాలోని జలాశయాల్లో త్వరలోనే చేపపిల్లలు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించింది. ఒకటి, రెండు రోజుల్లో జిల్లాలోనూ చేపపిల్లల పంపిణీ మొదలయ్యే అవకాశముందని జిల్లా మత్స్య శాఖాధికారి శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని జలాశయాలు నిండా నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యాన చేప పిల్లలను విడుదల చేస్తే మార్చి, ఏప్రిల్ నాటికి అవి పెరగనున్నాయి. జిల్లాలో సుమారు 16వేల మంది మత్స్యకారులు చేపల వేట, అమ్మకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.