
రైతుల బీమా కోసం రూ.17.53 లక్షలు
ఖమ్మం అర్బన్: టేకులపల్లి ఆంధ్రాబ్యాంక్ సేవా సంఘం లిమిటెడ్‌లో సభ్యులైన రైతులకు బీమా ప్రీమియం చెల్లించాలని పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ఖమ్మం రాధాకృష్ణనగర్‌లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ నాగచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరగగా రుణాల వసూళ్లలో వేగం పెంచి, కొత్త రుణాల మంజూరు చేయాలని తీర్మానించారు. అంతేకాక రూ.1.09 లక్షలతో పాలేరు నియోజకవర్గం గోకినపల్లిలో ఎరువుల గోదాం నిర్మాణం, బంగారం తాకట్టు రుణాలు గ్రాముకు రూ.5,700 నుంచి రూ.7వేలకు పెంచాలని నిర్ణయించారు. ఇంకా 59ఏళ్ల లోపు 2,737మంది సభ్యులకు బీమా కోసం రూ.630 చొప్పున రూ.17.53 లక్షల ప్రీమియం చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం ఎండీ లక్ష్మీప్రసన్న, సీఈఓ బి.అశోక్, వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, డైరెక్టర్లు వాకధాని రాంనారాయణ, కుర్ర భాస్కరరావు, రావెల కిషన్, మన్నేపల్లి రవి, లింగా నాగార్జున, భూక్యా ఉపేందర్, పొన్నం వెంకటేశ్వర్లు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ భూగర్భ కేబుల్ పనుల పరిశీలన
మధిర: మధిరలోని ఆత్కూర్ క్రాస్ నుంచి మెయిన్ రోడ్డు మీఉదగా నందిగామ బైపాస్ వరకు రూ.28 కోట్ల వ్యయంతో వేస్తున్న భూగర్భ విద్యుత్ లైన్ పనులను ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరి మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. ఉద్యోగులతో కలిసి పనులను పరిశీలించిన ఆయన త్వరగా పూర్తయ్యేలా వేగం పెంచాలని సూచించారు. తొలుత డైరెక్టర్‌ను ఉద్యోగులు సన్మానించారు. చీఫ్ ఇంజనీర్ తిరుమలరావు, డీఈలు బండి శ్రీనివాసరావు, భద్రుపవార్, ఏడీఈ ఎం.అనురాధ, ఏఈ ఎస్.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు
కల్లూరు రూరల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది నిబంధనల మేరకు వ్యవహరించాలని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి చందన్‌కుమార్ స్పష్టం చేశారు. కల్లూరు మండలం చండ్రుపట్లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనికీ చేశారు. ఈ సందర్భంగా డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు, ఎలక్ట్రానిక్ కాంటా సిద్ధం చేసుకోవడమే కాక ఒక్కో బస్తాలో 40.700 కేజీ ధాన్యమే నింపాలని సూచించారు. కాంటాలు, మిల్లులకు తరలింపులో పొరపాట్లకు తావివ్వొద్దని ఆయన ఆదేశించారు.
‘చాంబర్’ ఎన్నికల షెడ్యూల్ విడుదల
నవంబర్ 16న పోలింగ్,
అదేరోజు ఫలితాలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల అధికారి పీబీ.శ్రీరాములు శుక్రవారం విడుదల చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ బేరర్ల పదవులతో పాటు 18 శాఖల పదవులకు నవంబర్ 16న ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించి, 30వ తేదీన పరిశీలిస్తారు. ఇక 31న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి బరిలో మిగిలిన వారి జాబితా విడుదల చేస్తారు. ఆపై నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు సోమ నరసింహారావు, మన్నెం కృష్ణ పాల్గొన్నారు.

రైతుల బీమా కోసం రూ.17.53 లక్షలు

రైతుల బీమా కోసం రూ.17.53 లక్షలు