
ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి
ప్రజల అంగీకారంతోనే రోడ్డు వెడల్పు పనులు
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం అర్బన్: జిల్లా కేంద్రంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం ముస్తఫానగర్‌లో రూ.3 కోట్లతో నిర్మించే బీసీ బాలుర వసతి గృహం పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముస్తఫానగర్‌లో బీసీ వసతి గృహ నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరు చేయగా, నగరంలోని కూలే స్థితిలో ఉన్న మరో మూడు హాస్టళ్లకు కూడా రూ.9 కోట్లు కేటాయించామని తెలిపారు. భవనాలు కలకాలం నిలిచేలా నాణ్యతతో నిర్మించాలని సూచించారు. కాగా, ప్రజల అంగీకారంతోనే బోనకల్ రోడ్డును విస్తరిస్తామని మంత్రి తెలిపారు. అయితే, అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. నష్టపోయే వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. ఇక రైల్వేస్టేషన్ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి.. కార్పొరేటర్లు వారి డివిజన్లలో విస్తరించాల్సిన రోడ్ల వివరాలతో ప్తిపాదనలు సమర్పించాలని సూచించారు. ఇక నగరంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం రూ.220 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ నిధులతో చేపట్టే పనులతో రానున్న వేసవిలో తాగునీటి కొరత రాకపోగా, ప్రతి ఇంటికీ శుద్ధమైన నీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్లు, నాయకులు రోజ్‌లీలా, కమర్తపు మురళి, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, మలీదు వెంకటేశ్వర్లు, అశోక్, తుపాకుల యలగొండ స్వామి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి జ్యోతి, ఆర్‌డీఓ నర్సింహారావు, ఈఈ రంజిత్, కృష్ణలాల్, సహాయ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.