
సోలార్ విద్యుదుత్పత్తి పెంపు
● విద్యుత్ ఉద్యోగులు బాధ్యతతో పనిచేస్తేనే ఫలితం ● ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు రూపొందించడమే కాక ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లోనూ సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా అన్ని చర్యలు చేపడుతామని తెలిపారు. ఖమ్మం కలెక్టర్ పేర్కొన్నట్లు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. జిల్లాలో పారిశ్రామిక అవసరాల దృష్ట్యా రెండు 400 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
‘పొలం బాట’తో పరిష్కారం
వంగిన స్తంభాలు, లూజ్ వైర్ల సమస్యలను ప్రతీ వారం చేపట్టే పొలం బాటలో గుర్తించి పరిష్కరించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వరదల, వర్షాల సమయాన ప్రాణాలకు తెగించి మరీ సిబ్బంది పని చేస్తున్నారని కొనియాడారు. అయితే, స్వార్థంతో వ్యవహరించే ఇంకొందరు శాఖ పేరు చూడగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈమేరకు లైన్‌మెన్ మొదలు సీఎండీ వరకు బాధ్యతలు నిబద్ధతతో నిర్వహిస్తే విద్యుత్ శాఖ మంచి ఫలితాలను సాధిస్తుందని తెలిపారు. ఇక గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దని, వ్యవసాయ కనెక్షన్లు త్వరగా మంజూరు చేయాలన్నారు. అంతేకాక నీటి పారుదల కాల్వలు, భూముల వద్ద సోలార్ విద్యుత్ ప్యానళ్లు, మీడియం ప్రాజెక్టుల వద్ద ఫ్లోటింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దేవాదాయ భూముల్లోనూ కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.
అందుబాటులో అత్యవసర వాహనాలు
విద్యుత్ సరఫరాలో లోపాలు ఎదురైన చోటకు పరికరాలతో సిబ్బంది వెళ్లేలా ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, వీటికి జీపీఎస్ ఏర్పాటు చేశామని ఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రతీ వారం పొలంబాట నిర్వహిస్తుండగా, విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. గృహజ్యోతి పథకం కింద రెండు ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 10 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఖమ్మం మయూరి సెంటర్, బస్టాండ్ ఏరియాలో డిమాండ్ పెరగడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అక్కడ ఎన్నెస్పీ భూమి ఉన్నందున ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే, జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్‌లాల్, కె.తిరుమల్‌రావు, రాజుచౌహాన్, ఆర్.చరణ్‌దాస్, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు పాల్గొన్నారు.