ఖమ్మంఅర్బన్: మున్నేటి వరద ముప్పు నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతుండగా, దీన్ని మరింత పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.690 కోట్ల అంచనా వ్యయంతో మున్నేటికి ఇరువైపులా సుమారు 17 కి.మీ. మేర రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని కాలనీలకు కూడా ముప్పు పొంచి ఉన్నందున ఇంకా 13 కి.మీ. పొడిగించాలని నిర్ణయించారు. ఈమేరకు జలవనరుల శాఖ డీఈ ఉదయ్‌ప్రతాప్, ఏఈలు రాజేశ్వరరావు, సంతోష్‌రెడ్డితో పాటు వర్క్ ఇన్‌స్పెక్టర్ల ఆధ్వర్యాన సర్వే చేస్తున్నారు. గత ఏడాది మున్నేటికి వరద ముంచెత్తడంతో వేలాది ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అలాంటి వరద మళ్లీ వచ్చినా ఇబ్బంది లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పొడిగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో ప్రకాశ్‌నగర్ వద్ద నుంచి ధంసలాపురం వద్ద నేషనల్ హైవే వంతెన వరకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి స్థల పరిశీలన చేపడుతున్నారు.
13 కి.మీ. మేర పొడిగించేలా నిర్ణయం