
పత్తి కొనుగోళ్లలో సాంకేతిక సమస్య
● సాఫ్ట్‌వేర్ మొరాయించడంతో నిలిచిన కొనుగోళ్లు ● వచ్చే సోమవారం నుంచి తీసుకురావాలని సూచన
ఖమ్మంవ్యవసాయం/తిరుమలాయపాలెం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. సాఫ్ట్‌వేర్‌లో ఎదురైన సాంకేతిక సమస్యలతో కొనుగోళ్లు నిలిచిపోగా, జిన్నింగ్ మిల్లుల వద్ద రైతులు పత్తి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎనిమిది జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు నిర్ణయించగా, రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళ, బుధవారాల్లో నాలుగు కేంద్రాలు మొదలయ్యాయి. ఈమేరకు రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని వాహనాల్లో పత్తి తీసుకొచ్చారు. అక్కడ వ్యవసాయ శాఖ నమోదు చేసిన పంట సాగు వివరాలు, స్లాట్ వివరాలు పరిశీలించాక కొనుగోలు చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సమస్యతో బ్రేక్ పడింది. ఈమేరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి సమస్యపై సాఫ్ట్‌వేర్ సమకూర్చిన సంస్థ నిర్వాహకులతో మాట్లాడి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తొలిరోజు ఒక్కో మిల్లు వద్దకు 10 – 15 వాహనాల్లో పత్తితో రైతులు రాగా, సాయంత్రం కురిసిన వర్షంతో పత్తి కొంతమేర తడిసింది. ఈవిషయమై వివరణ కోరేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. కాగా, గోల్‌తండాలోని జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయని తెలుసుకున్న మద్దులపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్‌రెడ్డి, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేష్ చేరుకుని మార్కెట్, సీసీఐ అధికారులతో మాట్లాడాక తేమ శాతం పరీక్షించి దిగుమతి చేసుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల నేపథ్యాన రైతులు నుంచి పత్తి తీసుకురావాలని అధికారులు సూచించారు.