
ఇకపై ఒకే పిన్‌కోడ్
హెడ్ పోస్టాఫీస్ నుంచే బట్వాడా
ఖమ్మం అంతటికీ 507 001
● బట్వాడా కేంద్రాల విలీనం.. ఐడీసీ ఏర్పాటు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలు వేగంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా సంస్కరణలు తీకొస్తున్నారు. ఇందులో భాగంగానే నగరాలు, పట్టణాల్లో ఒకటికి మించి ఉన్న బట్వాడా కేంద్రాలను విలీనం చేస్తూ ‘ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్’(ఐడీసీ) ఏర్పాటుకు తపాలా శాఖ నిర్ణయించింది. తద్వారా కౌంటర్(ఫ్రంట్ ఆఫీస్), పంపిణీని క్రమబద్ధీకరించి బట్వాడా వేగంగా పూర్తిచేయొచ్చని చెబుతున్నారు.
ఐడీసీగా ఖమ్మం హెడ్‌పోస్టాఫీస్
ఖమ్మం నగరంలోనూ కొత్త విధానం అమలుచేయనున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో టౌన్–1(హెడ్ పోస్టాఫీస్–507001), టౌన్–2(పాత కలెక్టరేట్–507002), టౌన్–3(గాంధీచౌక్–507003) బట్వా డా కేంద్రాలు ఉన్నాయి. మూడింటికి వేర్వేరు పిన్‌కోడ్ నంబర్లు ఉండడంతో కొత్త వ్యక్తులకు తెలియక పొరపడితే గమ్యస్థానాలకు చేర్చడంలో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన మూడు కేంద్రాలను విలీనం చేసి ఖమ్మం హెడ్ పోస్టాఫీస్ కేంద్రంగా ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేస్తారు. దీంతో మూడు పిన్‌కోడ్లను రద్దు చేసి నగరమంతా 507001 పిన్‌కోడ్ అమలుచేస్తారు.
చకచకా ఏర్పాట్లు
ఖమ్మం హెడ్‌పోస్టాఫీస్‌లో ఐడీసీ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. మూడు పోస్టాఫీసుల్లో పనిచేసే 29 మంది పోస్టుమెన్లు ఇకపై ఐడీసీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో అందరికీ సరిపడా ఏర్పాట్లు సాగుతున్నాయి. బట్వాడా వస్తువుల పరిశీలన, పోస్టుమెన్ల సీటింగ్ పనులను త్వరలోనే పూర్తి చేసి ఐడీ సెంటర్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఖమ్మం నగరమంతా హెడ్ పోస్టాఫీస్ నుంచే బట్వాడాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు బట్వాడా కేంద్రాలు ఉండడంతో పలు
సందర్భాల్లో జాప్యం జరిగి వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి.. వేగంగా, సమర్థవంతంగా సేవలు
అందించడమే లక్ష్యంగా ఐడీసీ ఏర్పాటు చేయనున్నాం. – కె.సుబ్రహ్మణ్యం,
పోస్టుమాస్టర్, హెడ్‌పోస్టాఫీస్, ఖమ్మం