13 నుంచి శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగయ్యేలా ఈనెల 13 నుంచి పది రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి బైపాస్ రోడ్, సారధినగర్, ఎఫ్‌సీఐ గోడౌన్ ప్రాంతాల్లో శనివారం కలెక్టర్ పరిశీలించారు. రోడ్లకు ఇరువైపులా, సైడ్ డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలు, మట్టిని తొలగించాలని ఆదేశించారు. అలాగే, పవర్ స్వీపింగ్ యంత్రాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ కార్మికులు, జవాన్ల వారీగా రోజువారీ కార్యాచరణ రూపొందించాలని, ప్రతీ ఉద్యోగి పారిశుద్ధ్య డ్రైవ్‌లో పాల్గొనాలని తెలిపారు. అంతేకాక ప్రధాన రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఉద్యాన అధికారి రాధిక, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఖమ్మంలో పర్యటించిన కలెక్టర్,
కమిషనర్


