అన్నదాత గుండెల్లో దడ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత గుండెల్లో దడ

Oct 24 2025 2:42 AM | Updated on Oct 24 2025 2:42 AM

అన్నదాత గుండెల్లో దడ

అన్నదాత గుండెల్లో దడ

పంటలు చేతికందే సమయాన అల్పపీడనం వర్షంతో పత్తి, మొక్కజొన్న, వరిపై ప్రభావం మొక్కలపైనే రంగు మారుతున్న పత్తి

ఖమ్మంవ్యవసాయం: వరుణుడు అన్నదాతకు దడ పుట్టిస్తున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం ఆకాశం మేఘావృతమై ఉండగా, గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్ర, శనివారాల్లోనూ వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

పంటలకు ప్రతికూలం

వానాకాలంలో సాగైన పంటలకు ప్రస్తుత వానలు ప్రతికూలంగా మారుతున్నాయి. అన్ని పంటలు కలిపి జిల్లాలో 6,97,441 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 2.95 లక్షల ఎకరాల్లో, పత్తి 2,25 లక్షల ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికందుతోంది. ఈ సమయాన వర్షంతో పంట నేలవాలుతోందని, కాయలోకి నీరు చేరి రంగు మారుతోందని ఆవేదన చెందుతున్నారు. అసలే దిగుబడి పడిపోగా, ఇప్పుడు రంగు మారడంతో మద్దతు ధర దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే, ఆరబెట్టిన మొక్కజొన్న కూడా రంగు మారే ప్రమాదముంది. అంతేకాక సత్తుపల్లి, కూసుమంచి డివిజన్లలో వరి కోతలు మొదలుపెట్టారు. మిగతా చోట్ల వరి పొట్ట దశ నుంచి కోత దశకు చేరడంతో తాజా వర్షాల కారణంగా కోతలు వాయిదా వేస్త్తున్నారు. ఇక మిర్చి తోటలకు ఈ వాతావరణం ప్రతికూలంగా మారుతుంది.

ఖమ్మం మార్కెట్‌లో పరుగులు

అల్పపీడనం కారణంగా గురువారం ఉదయం ఒక్కసారిగా వాతారణంలో మార్పులు చోటు చేసుకొని వర్షం కురిసింది. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయానికి తీసుకొచ్చిన పత్తి బస్తాలను రక్షించుకునేందుకు రైతులు పరుగులు తీశారు. మార్కెట్‌ కమిటీ టార్పాలిన్లు సమకూర్చడంతో వాటిని కప్పి జాగ్రత్త పడ్డారు. ఆపై వర్షం తగ్గగానే వ్యాపారులు కాంటా వేయించి గోదాంలకు తరలించారు.

ఓ మోస్తరు వాన

అల్పపీడనం ప్రభావంగా జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు రఘునాథపాలెం మండలం పంగిడిలో అధికంగా 49.8 మి.మీల వర్షపాతం నమోదైంది. అలాగే, తిమ్మారావుపేట 40.8, మంచుకొండలో 33.3, వేంసూరులో 30.8, లింగాలలో 29.8, ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద 24, రఘునాథపాలెంలో 16.8, సిరిపురంలో 16.3, చింతకానిలో 16, పమ్మి, నాగులవంచలో 15, గంగారంలో 14, వైరా ఏఆర్‌ఎస్‌ వద్ద 13.3, ఖమ్మం ప్రకాష్‌నగర్‌, సత్తుపల్లి సదాశివునిపాలెంలో 11.3, ఖమ్మం ఖానాపురంలో 10.8, కల్లూరు, రావినూతల, నేలకొండపల్లిలో 10 మి.మీ.ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.

తేమ పేరిట పత్తి కొనుగోళ్లకు నిరాకరణ

జిన్నింగ్‌ మిల్లుల్లో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యాన పత్తి విక్రయాలకు వాన ప్రతిబంధకంగా మారింది. జిల్లాలోని పలుచోట్ల కొనుగోళ్లు మొదలుపెట్టగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులు పత్తిని తీసుకొస్తే అధిక తేమ ఉందని నిరాకరిస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో 18 మంది రైతుల నుంచి 33 మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం 8 – 12 శాతం తేమ ఉంటేనే సీసీఐ కొనుగోలు చేయనుంది. కానీ ప్రస్తుత వాతావరణంలో తేమ పెరగగా విక్రయాలు జోరందుకోవడం లేదు. కాగా, గురువారం జిల్లాలో ఒక్క రైతు కూడా పత్తి విక్రయానికి స్లాట్‌ బుక్‌ చేసుకోలేదని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ఎంఏ.అలీం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement