ముగిసిన మద్యం టెండర్లు
● 116 వైన్స్‌కు 4,430 దరఖాస్తులు ● గడువు పెంచినా స్పందన అంతంతే.. ● ఈనెల 27వ తేదీన డ్రా ద్వారా వైన్స్ కేటాయింపు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు గత నెల 26వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొదట ఈనెల 18వరకే గడువు విధించగా, అదేరోజు బీసీల బంద్ ఉండడంతో బ్యాంకులు తెరుచుకోలేదని అందిన వినతులతో గురువారం వరకు గడువు పొడిగించారు. అయినప్పటికీ పెద్దగా దరఖాస్తులు పెరగకపోవడం గమనార్హం.
గడువు పెంచాక 387
తొలి దఫా గడువు ముగిసే నాటికి జిల్లాలోని వైన్స్‌కు 4,043 దరఖాస్తులు అందాయి. అయితే, గడువు పెంచడంతో భారీగా పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు భావించినా ఆ స్థాయిలో ఫలితం కానరాలేదు. కొత్తగా 387 దరఖాస్తులే రావడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 4,430కి చేరింది. దీంతో ఒక్క దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖకు రూ.132.90కోట్ల ఆదాయం సమకూరింది. గత పాలసీలో రూ.2లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచడమే స్పందన రాకపోవడానికి కారణంగా భావిస్తున్నారు.
ముఖం చాటేసిన ఏపీ వ్యాపారులు
జిల్లాలోని పలువురు వ్యాపారులతో సిండికేట్‌గా మారిన ఏపీ వ్యాపారులు వైన్స్‌కు దరఖాస్తులు సమర్పించారు. గడువు పెంచాక మరికొందరు వస్తారని భావించినా రాలేదు. ఇప్పటికే చాలా టెండర్లు వేసినందున మరోమారు రాలేమంటూ తమకు ఫోన్ చేసిన ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం.
బల్క్ టెండర్లే ఎక్కువ
మద్యం వ్యాపారులు ఈసారి దుకాణాలు దక్కించుకునేందుకు బల్క్‌గానే దరఖాస్తులు వేశారు. గ్రూప్‌లుగా ఏర్పడిన పలువురు ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వైన్స్ కోసం టెండర్లు వేశారు. ఒక్కో గ్రూప్ నుంచి 20 మొదలు 70 వరకు దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. కొన్ని షాపులకు ఆంధ్రా – తెలంగాణ వ్యాపారులు సిండికేట్ అయి టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇక బార్ షాపుల యజమానులు ఒకరిద్దరు తప్ప మిగతా వారు వైన్స్‌పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈనెల 27వ తేదీన జరిగే డ్రాలో వైన్స్ దక్కించుకునేదెవరో తేలనుంది.
ముగిసిన మద్యం టెండర్లు


