రూ.919 కోట్లు.. 37 రోడ్లు
● ‘హ్యామ్’ విధానంలో నిర్మాణానికి మంజూరు ● పలు రహదారుల విస్తరణ, నిర్మాణం ● మెరుగుపడనున్న రవాణా సౌకర్యం
ఖమ్మంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర హైబ్రిడ్ యాన్యూటీ మోడల్(హ్యామ్) విధానంలో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిపాదనలకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించగా, త్వరలోనే టెండర్ నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా, జాబితాలో జిల్లాలోని పలు రహదారులకు కూడా స్థానం దక్కింది. మొత్తం 414 కి.మీ. మేర 37 రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల కోసం రూ.919.86 కోట్లు మంజూరు చేశారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యాన హ్యామ్ విధానంలో చేపట్టే ఈ పనులు పూర్తయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పనుల్లో భాగంగానే వైరా నుంచి జగ్గయ్యపేట రోడ్డు, ఖమ్మం – బోనకల్లు రోడ్డును డబుల్ లేన్లుగా విస్తరించనున్నారు. ఏపీ రాష్ట్రానికి అనుసంధానంగా ఈ రహదారులు ఉండడంతో రద్దీ దృష్ట్యా పది మీటర్ల రోడ్డుగా నిర్మాణానికి ప్రతిపాదించారు.
మంజూరైన రహదారుల్లో కొన్ని..
‘హ్యామ్’ విధానంలో అభివృద్ధి చేయనున్న రహదారుల జాబితా విడుదలైంది. ఇందులో పల్లిపాడు – గుబ్బగుర్తి – జన్నారం – బక్క చింతలపాడు బస్వాపురం – పొద్దుటూరు రోడ్డు, ఖమ్మం – ఇల్లెందు రోడ్డు, ఖమ్మం బైపాస్ రోడ్ (ఎఫ్‌సీఐ గోదాం వద్ద), రాయపట్నం బ్రిడ్జి నుండి మోటమర్రి రైల్వేస్టేషన్ వరకు, ఖమ్మం – వైరా నుంచి కొదుమూరు – రుద్రమకోట – పుట్టకోట రహదారి జాబితాలో ఉన్నాయి. అలాగే, వెంకటాపురం రోడ్డు, ఖమ్మం – కొత్తకొత్తూరు, పెనుబల్లి – అడిసర్లపాడు, తల్లాడ – భద్రాచలం రోడ్డు, ఖమ్మం – సూర్యాపేట రోడ్డు, వీ.వీ.పాలెం – రఘునాథపాలెం – వేపకుంట్ల – గణేశ్వరం లింక్ రోడ్డు, ఖమ్మం – ఇల్లెందు రోడ్డు నుండి దేవరపల్లి లింక్ రోడ్డు నిర్మిస్తారు. అంతేకాక మధిర – నందిగామ, వెంకటాపురం –కూసుమంచి, లక్ష్మీపురం – వెంకటగిరి, గుదిమల్ల – కోదాడ, నేలకొండపల్లి – పాలేరు, జక్కేపల్లి రోడ్డు, కల్లూరు – ఊట్కూరు, ఖమ్మం – మర్లపాడు – రామాపురం తదితర రోడ్లతో మరికొన్ని ప్రాంతాల రహదారులు జాబితాలో ఉన్నాయి.
నిర్మాణం, విస్తరణతో ఇక్కట్లకు చెక్
తాజాగా లభించిన అనుమతులతో సింగిల్ లేన్‌గా ఉన్న రహదారులను డబుల్ లేన్‌గా విస్తరిస్తారు. మిగతా చోట్ల దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్త రహదారులు నిర్మిస్తారు. జాబితాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంత రహదారులే ఉండడంతో పట్టణా ల నుంచి గ్రామాలకు రవాణా వ్యవస్థ బలోపేతమవుతుందని చెబుతున్నారు. తద్వారా ప్రయాణ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి.


