శబరిమలకు ఆర్టీసీ బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ చార్జీలతో ఆర్టీసీ బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి పుష్‌బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బస్సుల కోసం ఖమ్మం డిపో మేనేజర్(99592 25958), సత్తుపల్లి డిపో(99592 25962), కొత్తగూడెం డిపో (99592 25959), భద్రాచలం డిపో (99592 25960), మధిర డిపో (99592 25961), మణుగూరు డిపో (99592 25963) మేనేజర్‌ను సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.
వృత్తి నైపుణ్య శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులైన మైనార్టీలకు వృత్తి నైపుణ్య రంగాల్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగ కల్పన కల్పించేలా వృత్తి శిక్షణా సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎండీ.ముజాహిద్ తెలిపారు. రిజిస్ట్రేషన్, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అనుసంధానం కాపీలు, గడిచిన మూడేళ్ల పన్ను చెల్లింపులు, గత మూడేళ్లలో ఇచ్చిన శిక్షణ, గత ఏడాది కాలానికి ఉద్యోగాలు కల్పించిన వారి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాల్సి ఉండగా, వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని ఆయన తెలిపారు.
ఎన్నెస్పీ క్యాంప్‌లో
డీసీసీ ఆఫీస్
● కాంగ్రెస్ కార్యాలయానికి ఎకరం భూమి
ఖమ్మం అర్బన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయిచింది. ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లో భూమి కేటాయిస్తూ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ప్రస్తుత పాత బస్టాండ్ సమీపాన ఉన్న కార్యాలయంలో కార్యకలాపాలకు ఇక్కట్లు ఎదురవుతున్నందున నూతన భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కోరారు. ఈమేరకు ఆయన 2024 ఫిబ్రవరి 21న ప్రభుత్వానికి విన్నవించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ వినతులను పరిగణనలోకి తీసుకుని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సర్వే నంబర్ 93లోని ఎకరం ఎన్నెస్పీ భూమిని కాంగ్రెస్ కార్యాలయానికి కేటాయించారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
‘సోలార్’ విద్యుత్
సరఫరాకు లైన్
ఎర్రుపాలెం: మండలంలోని రాజుపాలెం రెవెన్యూ మోటాపురం సబ్‌స్టేషన్ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేయనున్నారు. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వెంకటాపురం సబ్‌స్టేషన్‌కు అనుసంధానించేలా ప్రత్యేక లైన్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఒక మెగావాట్ సామర్ధ్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ బండి శ్రీనివాసరావు, ఏడీఈలు అనురాధ, నాగమల్లేశ్వరావు, ఏఈలు బోజ్యా, అనూష, ఎంపీడీఓ సురేందర్, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.
పోలీసు అమరుల
కుటుంబాలకు
అండగా నిలుస్తాం
ఖమ్మంక్రైం: పోలీసు అమరవీరుల కుటుంబసభ్యులకు అండగా ఉంటామని సీపీ సునీల్‌దత్ తెలిపారు. కమిషనరేట్‌లో గురువారం ఆయన అమరవీరుల కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలు ఇప్పించాలని కోరగా, ఇప్పటికే ప్రక్రియ మొదలైందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కమిషనర్ తెలిపారు.
శబరిమలకు ఆర్టీసీ బస్సులు


