
రిజర్వేషన్.. పరేషాన్
ఇంకొన్ని చోట్ల ఒకరు, ఇద్దరే అభ్యర్థులు
ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్న జీపీలు సైతం బీసీలకు రిజర్వ్
మార్పులు చేయాలని కలెక్టర్,
ఆర్డీఓలకు వినతులు
ఈ మండలాల్లో ఇలా ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుచేస్తున్న రిజర్వేషన్లతో ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోతుండగా.. ఆయా కేటగిరీ అభ్యర్థుల కోసం రాజకీయ పార్టీలు అన్వేషించా ల్సిన పరిస్థితి నెలకొంది.గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్నిచోట్ల అభ్యర్థులే కరువయ్యేలా కనిపిస్తోంది. అలాగే చాలా పంచాయతీల్లో రిజర్వ్ కేటగిరిలో ఒకటి, రెండు కుటుంబాలే ఉన్నాయి. ఈ నేపథ్యాన పార్టీలు బలంగా ఉన్నా.. అభ్యర్థులు లేకపోవడం తలనొప్పి తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. ఈ కారణంగా చాలా గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవాలు అనివార్యంగా మారనున్నాయి.
ఆశలపై నీళ్లు
సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో ఉండాలనే ఆసక్తితో గ్రామీణ ప్రాంతాల్లో పలువురు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. కానీ రిజర్వేషన్ల వ్యవహారం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇదే సమయాన రాజకీయాలతో సంబంధం లేకుండా ఇతర పనులు చేసుకుంటున్న వారికి కలిసొస్తోంది. చాలా గ్రామాల్లో రిజర్వ్ స్థానాల్లో ఒకరు, ఇద్దరు మాత్రమే ఆ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. దీంతో వారే సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నిక కావడం లాంఛనంగా మారనుంది. ఇక బీసీలకు రిజర్వ్ అయిన గ్రామపంచాయతీల్లో బీసీ అభ్యర్థి దొరకని పరిస్థితి నెలకొనడం.. గిరిజనులు ఎక్కువగా ఉండే జీపీలు బీసీలకు, ఎస్సీలు లేని చోట్ల ఎస్సీలకు రిజర్వ్ కావడం గమనార్హం.
ఎందుకిలా..
రిజర్వేషన్లతో కొన్ని గ్రామపంచాయతీల్లో నెలకొన్న అయోమయ పరిస్థితిపై రాజకీయ పార్టీలు ఆలోచనలో పడ్డాయి. ఆయా పంచాయతీల్లో రిజర్వేషన్‌కు తగినట్లుగా అభ్యర్థులు అందుబాటులో లేరు. కొన్ని గ్రామాల్లో రిజర్వ్ కేటగిరీలో ఒకరిద్దరే అర్హులు ఉండడంతో వారిని ఆకర్షించేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు 2018 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్ల కోసం 2024 కులగణనను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్నిచోట్ల ఇలా జరిగిందనే చర్చ సాగుతోంది. అయితే నిబంధనల మేరకే రిజర్వేషన్లు చేసినందున మార్చడం కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా రిజర్వ్ కేటగిరీ జనాభా తమ జీపీల్లో అతి తక్కువగా ఉన్నందున రిజర్వేషన్లు మార్చాలని కొందరు ఇటీవల కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు.
కొన్ని రిజర్వ్‌డ్ స్థానాల్లో
ఆ కేటగిరీ అభ్యర్థులు కరువు
చింతకాని మండలం రాఘవాపురం సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో మొత్తం 471 మంది ఓటర్లకు ఒకే ఎస్సీ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కాంపల్లి కోటమ్మ, ఆమె కుమారుడు దావీదు ఉండడంతో సర్పంచ్‌గా కోటమ్మ ఏకగ్రీవం కానుంది. ఇక నాలుగో వార్డు ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కాగా దావీదు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమే. ఫలితంగా తల్లీకొడుకులు సర్పంచ్, వార్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కూసుమంచి మండలం ధర్మాతండా బీసీ జనరల్‌కు రిజర్వ్ కాగా అక్కడ కుమ్మరికుంట్ల నాగరాజు – శ్రావణి ఇద్దరే బీసీ ఓటర్లు. వీరిది పక్కనే కేశ్వాపురమైనా తండా వద్ద కోళ్ల ఫారం పెట్టుకుని ఇక్కడే ఓటు హక్కు పొందారు. ఇక మంగలి తండా బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఆ తండా యువకుడు బీసీ యువతి అనితను వివాహం చేసుకోవడంతో ఆమెకు ఓటు వచ్చింది. ఇదే తండాకు చెందిన మరో యువకుడు బీసీ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్న ఆమెకు ఓటు లేకపోవడంతో అనిత ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఇదే మండలం లాల్‌సింగ్ తండా సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా అక్కడ ఒకే బీసీ కుటుంబం నుంచి అత్తాకోడళ్లలో ఒకరికి అవకాశముంది. అజ్మీరా హీరామాన్ తండా బీసీ మహిళకు రిజర్వ్ అయితే అక్కడా ఒకే బీసీ కుటుంబం ఉన్నందున ఏకగ్రీవం కానుంది. అయితే, మంగలితండా, హీరామాన్ తండాల్లో ఇద్దరు యువకులు బీసీ యువతులను వివాహం చేసుకున్నా వారికి వేరే చోట ఓటు ఉంది. నామినేషన్ సమయానికి ఇక్కడకు మారితే పోటీ జరగొచ్చు. ఈనేపథ్యాన ధర్మా తండా, లాల్‌సింగ్ తండా, మంగలితండాలో రిజర్వేషన్ మార్చాలని స్థానికులు కలెక్టర్, ఆర్డీఓను కోరారు.
ఏన్కూరు మండలం షెడ్యూల్ ఏరియా కావడంతో అన్ని సర్పంచ్ పదవులు ఎస్టీలకు రిజర్వ్ అవుతున్నాయి. నూకాలంపాడులో 1,046మంది ఓటర్లకు ఒక్క ఎస్టీ కూడా లేరు. కానీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయింది. అంతేకాక 1, 2, 3, 4వ వార్డులూ ఎస్టీలకు రిజర్వు కావడంతో ఎన్నిక జరిగే అవకాశం లేదు. దీంతో మిగిలిన నాలుగు వార్డులకు ఎన్నికలు నిర్వహించిన విజేతల్లో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుని పంచాయతీ పాలన సాగిస్తారు.
పెనుబల్లి మండలం గౌరారం సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులు ఎస్టీలకు కేటాయించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీకి ఇద్దరికే అర్హత ఉంది. దీంతో ఇద్దరూ సర్పంచ్ పదవికి సిద్ధమవుతుండగా నాలుగు వార్డులకు ఎన్నిక జరిగే అవకాశం లేదు.
రఘునాథపాలెం మండలంలోని ఎన్.వీ.బంజర, రాములుతండా జీపీల్లో అత్యధికం ఎస్టీ ఓట్లు ఉంటే బీసీ ఓటర్లే లేరు. ఎన్.వీ.బంజర బీసీ మహిళ, రాములుతండా సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. ఈ విషయాన్ని తండాల వాసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కారేపల్లి మండలం కొత్తకమలాపురం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోగా, తండా యువకులు ముగ్గురు ఎస్టీ యువతులను కులాంతర వివాహం చేసుకున్నారు. తద్వారా ముగ్గురు ఎస్టీ ఓటర్లు ఉండగా కొర్ర రమ వీఆర్‌ఏ ఉద్యోగం చేస్తుండడంతో పోటీకి అవకాశం లేదు. మిగిలిన వట్టం ఉమారాణి, సులోచన 2019 ఎన్నికల్లో పోటీ పడగా ఉమారాణి గెలిచింది. ఈసారి కూడా వీరిద్దరే మరోమారు పోటీ పడనున్నారు.