
రెండో ప్రమాద హెచ్చరిక దాటి..
గోదావరిలో 49.70 అడుగులుగా నీటిమట్టం
ఆందోళన చెందుతున్న రైతులు
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగగా, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు చేరింది. దీంతో అధికారుల అప్రమత్తమై నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత ఇంకా పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు..
భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో భద్రాచలం వచ్చే భక్తులు స్నానాల కోసం గోదావరిలోకి దిగకుండా ఇనుప కంచె, ప్రమాద హెచ్చరిక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నీటిమట్టం 50 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఎగువన పేరూరు వద్ద గోదావరి ప్రవాహం కొంతమేర తగ్గిందని, ఈ క్రమంలో భద్రాచలంలోనూ తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో రాత్రి 10 గంటలకు కాస్త తగ్గి 49.70 అడుగులుగా నమోదైంది.
ముంపు బారిన పంటలు..
గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో పరీ వాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వారికి అక్టోబర్ ఎంతో విలువైంది. ఈ నెలలోనే పత్తి, వరి పంటలకు పాట్లు చేయడం సహా మిర్చి సాగు పనులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వరద నీటితో పంటలు, మిర్చి సాగు చేసే భూములు ముంపునకు గురికావడంతో దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. వరి, పత్తి రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరుతో పాటు ఏపీలోని పలు మండలాల్లో ఇప్పటికే పంటలు ముంపునకు గురయ్యాయి.