
పకడ్బందీగా ఎన్నికలు
పారదర్శకంగా రిజర్వేషన్ల ప్రక్రియ
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామపంచాయతీల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మూడు విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) అమలవుతుందని చెప్పారు. 571 గ్రామపంచాయతీలు, 5,214 వార్డుల ఎన్నికకు జిల్లాలోని 737 ఆవాసాల్లో 5,214 పోలింగ్ స్టేషన్లు గుర్తించామని తెలిపారు.
8,02,690మంది ఓటర్లు
ఈ ఏడాది జూలై 10వరకు నమోదైన ప్రకారం జిల్లాలో 8,02,690మంది ఓటర్లు ఉండగా... ఇందులో పురుషులు 3,88,243, మహిళలు 4,14,425, ఇతరులు 22 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో, లేదో పరిశీలిస్తారని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని తెలిపారు. అలాగే, మండల కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
అప్పీల్‌కు ఒక రోజు
నామినేషన్ల పరిశీలన అనంతరం అప్పీల్‌కు ఒక రోజు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం నుంచే ఎంసీసీ అమల్లోకి వచ్చినందున ప్రతీఒక్కరు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తామని తెలిపారు. తొలుత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్.. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణం పూర్తయ్యేలా అందరూ సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈసమావేశాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఎల్‌పీఓలు రాంబాబు, విజయలక్ష్మి, డీపీఆర్వో ఎంఏ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.
అధికారుల నియామకం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈక్రమాన జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటికల్ సర్వైలెన్స్ టీమ్(ఎస్‌ఎస్‌టీ)లను కలెక్టర్ అనుదీప్ నియమించారు. జోనల్ అధికారులు 40మందితో పాటు 20 ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 16 ఎస్‌ఎస్‌టీ బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే, నోడల్ అధికారులుగా 15మందిని నియమించారు. బృందాల వారీగా సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్స్‌ల పరిశీలన, రవాణా, శిక్షణ తదితర బాధ్యతలు అప్పగించారు.