
బీసీలకే పెద్దపీట !
స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చిన రిజర్వేషన్లు
పెద్దసంఖ్యలో స్థానాల్లో పోటీకి
అవకాశం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ కలిపి 309 స్థానాలు
వార్డుసభ్యులుగా 1,474 మంది
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వివరాలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అత్యధిక స్థానాల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. తద్వారా ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో బీసీల ప్రాతిని ధ్యం పెరగనుంది. వార్డు సభ్యులు మినహా మిగి లిన స్థానాల్లో ఎక్కువగా బీసీలకే రిజర్వు అయ్యా యి. దీంతో బీసీ అభ్యర్థులను బరిలో నిలిపేలా పార్టీలు ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభించాయి.
కలిసొచ్చిన రిజర్వేషన్లు
రిజర్వేషన్లు కలిసిరావడంతో ఈ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట దక్కనుంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిపి జిల్లాలో బీసీలు 1,783 స్థానాల్లో పోటీకి దిగనున్నారు. గ్రామపంచాయతీల్లోని వార్డులు మినహా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లుగా వీరే అత్యధికంగా ఉంటారు. మొత్తం 5,214 వార్డుసభ్యుల స్థానాల్లో బీసీలకు 1,474 సీట్లు దక్కగా.. జనరల్ కేటగిరీలో 1,644, ఎస్టీలకు 1,161, ఎస్సీలకు 935 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేసే బీసీ అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక 20 జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు ఎనిమిది, 283 ఎంపీటీసీ స్థానాల్లో 103 బీసీలకు, 72 జనరల్‌కు, 58 ఎస్సీలకు, 50 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అలాగే 20 ఎంపీపీ స్థానాల్లో ఎనిమిది బీసీలకు కేటాయించారు. జనరల్‌కు మూడు, ఎస్టీలకు ఐదు, ఎస్సీలకు నాలుగు రిజర్వ్ అయ్యాయి. ఇక 571 గ్రామపంచాయతీల్లో 190 సర్పంచ్ స్థానాలు బీసీలకు, 171 ఎస్టీలకు, 110 ఎస్సీలకు, 100 జనరల్‌కు ఉన్నాయి.
బరిలో నిలిచేందుకు ఉత్సాహం
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు ఉత్సాహంతో ఉన్నారు. పలు స్థానాలు రిజర్వ్ కావడంతో కొందరు సామాన్యులు కూడా రాజకీయ అరంగేట్రానికి అవకాశం దక్కినట్లయింది. రాజకీయ పార్టీల్లోని బీసీలు తమ ప్రాంతాల్లోనే కాకుండా రిజర్వ్ అయిన స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈక్రమంలో తమ వారి మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఫలితంగా కుల సంఘాలకు ప్రాధాన్యత పెరిగింది.
స్థానం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ మొత్తం
జెడ్పీటీసీ 04 04 08 04 20
ఎంపీటీసీ 50 58 103 72 283
ఎంపీపీ 05 04 08 03 20
సర్పంచ్ 171 110 190 100 571
వార్డుసభ్యులు 1,161 935 1,474 1,644 5,214
మొత్తం 1,391 1,111 1,783 1,823 6,108