
బతుకమ్మ
బంధుత్వం, స్నేహానికి ప్రాధాన్యత
కలిసికట్టుగా ఆటపాటలతో వేడుకలు
మగువల్లో వెల్లివిరుస్తున్న ఆనందం
బంధాలను పెంచే
ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే అతి పెద్ద పండుగ, మహిళల ప్రత్యేక పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూలతో పేర్చి ఆటపాటలతో సాగే సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సాగనంపే సద్దుల బతుకమ్మను పోయిరావమ్మ, మళ్లీ రావమ్మా అంటూ ఊరూ వాడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మకు ఇళ్లన్నీ మహిళలతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ వేడుకలను పుట్టింట్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కొందరు ఏ ప్రాంతంలో ఉన్నా, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నా బతుకమ్మ పండుగ కోసం పుట్టింటికి వచ్చి వేడుకలు నిర్వహిస్తుంటారు. పుట్టి పెరిగిన ఊరు, కలిసి చదువుకున్న స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడపడానికి మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. పుట్టింటి వారే గాక పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన కోడళ్లు సైతం అత్తవారి ఇంట్లోనే ఉండి బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ పండుగకు తల్లిగారింటికి వెళ్లినా బతుకమ్మ పండుగకు మాత్రం అత్తవారి ఇంట్లో ఉండి పూల పండగను జరుపుకోవాలని భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో పూలు కోసుకువచ్చి బతుకమ్మలను పేర్చుతారు. ప్రతి రోజు సాయంత్రం అందమైన దుస్తులు, పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను మోస్తూ బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్స్, కోలాటాలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ సమీప దేవాలయాలు, జలాశయాల వద్దకు చేరుకొని గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ పాటలతో సంబురాలు జరుపుకుంటున్నారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మ కోసం విదేశాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు మహిళల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం..
పూల పండుగకు ఎల్లలు దాటి వస్తున్న మహిళలు