
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి
ఖమ్మం మయూరిసెంటర్: ప్రజా సమస్యలపై యువత సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతల రమేష్, బొడ్డు మధు, మాజీ రాష్ట్ర నాయకుడు ఎం.ఏ.జబ్బర్‌లు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం డివిజన్‌లో జరిగిన డీవైఎఫ్‌ఐ మహాసభలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందాయని విమర్శించారు. అనంతరం నూతన డీవైఎఫ్‌ఐ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీఐటీయూ జిల్లా నాయకులు భూక్య శ్రీను, ఎస్.నవీన్‌రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం వీరబాబు, మాజీ నాయకులు షేక్.నాగుల్ మీరా, కూరపాటి శ్రీనులతో పాటు యర్రా శ్రీకాంత్, రావులపాటి నాగరాజు, కూచిపూడి నరేష్, యర్రా సాయి, యాటా రాజేష్, షేక్.రెహమాన్, పోటు హర్షవర్ధన్, కొర్లపాటి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
మహిళను వేధించిన వ్యక్తిపై కేసు
ఖమ్మంఅర్బన్: కుటుంబ గొడవల నేపథ్యంలో ఓ మహిళపై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలి) పోలీస్ స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని 1వ డివిజన్ కై కొండాయిగూడెంనకు చెందిన తేజావత్ వినోద్ ఓ మహిళను వేధిస్తున్నాడు. కొడవలి పట్టుకుని వెళ్లి ఆమెను చంపుతానని బెదిరించాడు. తర్వాత వినోద్ కుటుంబ సభ్యులు సుజాత, హుస్సేన్, మంగమ్మ బాధిత మహిళ ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ, చంపుతామని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ముగ్గురిపై కేసు
రఘునాథపాలెం: వ్యవసాయ భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా అడ్డుకున్న ముగ్గురిపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని చింతగుర్తికిచెందిన రైతు భరత్ తన భూమికి ఫెన్సింగ్ వేస్తుండగా, అదే గ్రామానికి చెందిన అశోక్, అనిలా, వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఉస్మాన్‌షరీఫ్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
నేలకొండపల్లి: ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బోదులబండకు చెందిన మహేశ్ (25) ఆదివారం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.