
●చెక్కుచెదరని ‘పాలేరు’
కూసుమంచి: 1928లో నిజాం పాలనలో పాలేరు చెరువు నిర్మించారు. నాటి చీఫ్ ఇంజనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో ఈ చెరువు నిర్మించారు. ఈ చెరువు తూములు, ఆనకట్టల నిర్మాణం అద్భుతంగా సాగింది. చతురస్రాకారంలో ఉన్న నున్నటి బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మధ్యలో సిమెంట్, కాంక్రీట్ లాంటి సీసం, డంగుసున్నం, బంకమట్టితో నిర్మాణ పనులు చేపట్టారు. చెరువులో నీరు నిండుగా ఉన్నా నేటికీ చుక్క కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజ నీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు.
పడిలేచే గేట్లు..
పాలేరు చెరువు నుంచి రిజర్వాయర్‌గా మారిన తర్వాత ఇంజనీర్ల మరో ఘనత ఏంటంటే.. వరదలు వచ్చినప్పుడు రిజర్వాయర్‌లో మిగులు నీరు అలుగు ద్వారా బయటకు వెళ్లేందుకు ఫాలింగ్ గేట్లు (పడి లేచే గేట్లు) అమర్చారు. దీంతో 21 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం దాటిన తర్వాత ప్రవాహం పెరిగిన కొద్దీ వాటంతట అవే పడిపోతాయి. రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతుంటే పైకి లేస్తుంటాయి.
దీంతో ఎంత పెద్ద వరద వచ్చినా రిజర్వాయర్‌కు ప్రమాదం ఉండదు. 1978లో రిజర్వాయర్ నిర్మాణంలో ఈ తరహా గేట్లు అమర్చారు. కొన్నేళ్ల క్రితం ఈ గేట్లు దెబ్బతినగా అదే పద్ధతిన కొత్త గేట్లు అమర్చారు.