
వెదజల్లు.. సాగు ఫుల్లు!
విస్తృత అవగాహన
వెదజల్లే విధానంలో వరి సాగుతో ఉన్న లాభాలను వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించొచ్చని, ఇతర ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాక అధికారులు క్షేత్రస్తాయిలో వెదజల్లే విధానంపై అవగాహన కల్పిస్తుండగా ఈ విధానం అవలంబించే రైతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే, గతంలో సాగు చేసిన రైతులు సత్ఫలితాలు సాధించడంతో ఇంకొందరు కూడా ముందుకొస్తున్నారు.
పాత విధానంలో వ్యయప్రయాసలు
వరి సాగు చేసే రైతులు ఆది నుంచి ముందుగా నేల తయారీ, విత్తనాలతో నారు పోయడం.. ఆపై కలుపు తొలగించడం చేశాక పొలంలో నాట్లు వేయించేవారు. ఇదంతా కలిపి ఎకరానికి సుమారు రూ.25వేల వరకు ఖర్చవుతుంది. అందులో ప్రతీ పనికి కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ కూలీల కొరత ఏటా పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారించారు. అలాగే, నారు తొలగించే సమయాన వేర్లు తెగిపోయి అధిక శాతం పిలకలే మిగులుతుండడం రైతులకు ఆర్థికంగా నష్టం ఎదురవుతోంది. ఈక్రమంలోనే వెదజల్లే పద్ధతి తెరపైకి వచ్చింది.
ఖర్చులు ఆదా..
వెదజల్లే పద్ధతిలో రైతులు మామూలుగానే పొలం దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత ఎకరాకు 10 – 12 కేజీల లోపు వరి విత్తనాలను చల్లాలి. ఈ పద్ధతిలో ఎక్కువ ఎత్తు పెరగని రకం విత్తనాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాక వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే కూలీల అవసరం పెద్దగా లేకపోగా, ఎకరాకు సుమారు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. కొన్నిచోట్ల పొడి దుక్కుల్లోనే రైతులు విత్తనాలు వెదజల్లుతుండగా వర్షాలు పడగానే మొలకెత్తుతున్నాయి. ఇక కాల్వల పరీవాహక ప్రాంతాల్లో తడి దుక్కుల్లో విత్తనాలు వెదజల్లి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇంకొందరు విత్తన శుద్ధి తర్వాత నానబెట్టడం, ఆపై గన్నీ సంచుల్లో నిల్వ చేసి మొలకలు వచ్చాక వెదజల్లే పద్ధతి అవలంబిస్తున్నారు. ఈమేరకు జిల్లాలోని ఒక్క కామేపల్లి మండలంలోని తాళ్లపల్లి, పండితాపురంలో సుమారు 2,200 ఎకరాల్లో వెదజల్లే విధానంలో వరి సాగు చేస్తుండా ఇంకొందరు రైతులు కూడా ముందుకొస్తున్నారు. అంతేకాక వైరా, తదితర మండలాల్లో ఈ విధానం నానాటికీ విస్తరిస్తోంది. కాగా, ఈ విధానంలో పెట్టుబడి తగ్గడమే కాక సాధారణ విధానంతో పోలిస్తే 15 రోజుల ముందే పంట కోత దశకు చేరుతోంది.
నారు, నాట్లు లేకుండా
వరి సాగుకు అవకాశం
కూలీల కొరతకు చెక్,
ఇతర ఖర్చులూ ఆదా
జిల్లాలో వెదజల్లే పద్ధతికి
పెరుగుతున్న ఆదరణ
అధికారుల అవగాహనతో
ముందుకొస్తున్న అన్నదాతలు
వరి సాగులో కొత్త ఒరవడి నానాటికీ విస్తృతమవుతోంది. నారు పోయడం, నాట్లు వేసే పని లేకుండా వెదజల్లే విధానంలో సాగుపై కలిగే లాభాలతో అధికారులు
అవగాహన కల్పిస్తుండడంతో జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వెదజల్లడం, ఇంకొన్ని ప్రాంతాల్లో కరివేదగా పిలిచే ఈ విధానంలో సాగు ఖర్చులు కూడా తగ్గుతుండడం రైతులకు కలిసొస్తోంది. – కామేపల్లి/వైరారూరల్
రైతులకు ఎంతో మేలు..
వరి సాగు చేసే రైతులు వెదజల్లే పద్ధతి అవలంబిస్తే శ్రమ తగ్గుతుంది. డ్రమ్ సీడర్ విధానంలో కూడా వరి సాగు చేసుకోవచ్చు. గతేడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ మంది రైతులు ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. వెదజల్లే విధానంలో సాగుకు ఇది సరైన సమయం.
– భూక్యా తారాదేవి, ఏఓ, కామేపల్లి
ఆదాయం పెరుగుతోంది..
గత యాసంగిలో నాలుగు ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేశాను. సాధారణ నాట్ల కంటే ఇది సులువుగా ఉంది. ఎకరాకు రూ.10వేల ఖర్చు తగ్గింది. పైరు కూడా ఆశించిన స్థాయిలో పెరుగుతోంది. ఈ విధానంలో పెట్టుబడి తగ్గడమే కాక ఆదాయం పెరుగుతోంది.
– కె.శ్రీనివాసరావు, రైతు, సోమవరం, వైరా మండలం

వెదజల్లు.. సాగు ఫుల్లు!

వెదజల్లు.. సాగు ఫుల్లు!

వెదజల్లు.. సాగు ఫుల్లు!