
జిల్లా వాసులకు డాక్టరేట్లు
తల్లాడ/రఘునాథపాలెం/ఖమ్మం సహకారనగర్: తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన తులసీరామ్ కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణపురం గ్రామంలోని సరికొండ సాంబశివరాజు – జ్యోతి దంపతుల కుమారుడైన తులసీ రామ్ గ్రామీణ మార్కెట్లలో డిజిటల్ చెల్లింపుల విధానాలపై అధ్యయనం చేసి పరిశోధనాత్మక పత్రం సమర్పించగా డాక్టరేట్ లభించింది. అలాగే, రఘునాథపాలెం మండలంలోని పంగిడికి చెందిన అజ్మీరా సుజాత కేయూ స్నాతకోత్సవంలో డాక్టరేట్ స్వీకరించింది. సీనియర్ ప్రొఫెసర్ బన్న ఐలయ్య పర్యవేక్షణలో ఆమె ‘తెలంగాణ బంజారా గేయాలు – జీవన చిత్రణ’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక పత్రానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా సుజాతను గ్రామ మాజీ సర్పంచ్ బానోతు మంగీలాల్‌నాయక్, గ్రామస్తులు అభినందించారు. అంతేకాక ఖమ్మంకు చెందిన అద్దెపల్లి చరిత్ర రాజనీతిశాస్త్ర విభాగంలో డాక్టరేట్ అందుకుంది. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఆమెను పలువురు అభినందించారు.

జిల్లా వాసులకు డాక్టరేట్లు