
ప్రతీ మండలంలో ‘సమర శంఖారావం’
ఖమ్మంమయూరిసెంటర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయం సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ఖాయమన్నారు. అయితే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో జిల్లాలో ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం సమావేశాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపా రు. ఎన్నికలు ఎప్పుడూ నిర్వహించిన సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే ఈ సమావేశాల లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన 19 నెలల్లో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెడుతున్నందున ప్రభుత్వ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం నుండి సమర శంఖారావం సమావేశాలు ప్రారంభమవుతాయని, ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇదే సమయాన పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుండి అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణగౌడ్, నాయకులు దొబ్బల సౌజన్య, మొక్కా శేఖర్‌గౌడ్, సీతారాములు, వేజెండ్ల సాయికుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల, గిడ్డంగుల సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు