
పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో 48 రకాల మొక్కలతో ఏర్పాటు
● నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల పేరుతో నాటి, సంరక్షణ ● మొక్కలకు పూజలు చేస్తున్న భక్తులు
నక్షత్రాల వారీగా మొక్కలు ఇవే..
హిందూ సంప్రదాయంలో జాతక రీత్యా ఒక్కో రాశి వారు నిర్దేశిత మొక్కకు పూజిస్తే శుభ ఫలితాలు గోచరిస్తాయని నమ్ముతారు. ఇందులో భాగంగా అశ్విని నక్షత్రం వారు అడ్డసరం, భరణి నక్షత్రం వారు ఉసిరి, కృతిక – మేడి, రోహిణి – నేరేడు, మృగశిర – సండ్ర, ఆరుద్ర – రేల, పునర్వసు – వెదురు లేదా గన్నేరు, పుష్యమి నక్షత్రం – రావి, ఆశ్లేష – నాగకేసరి, జ్యేష్ఠ – దేవదారు, అనూరాధ – పొగడ, విశాఖ – నాగమల్లి, స్వాతి – మద్ది, చిత్త – మారేడు, హస్త – కుంకుడు, ఉత్తర – జువ్వి, పుబ్బ – మోదుగు, మఖ – మర్రి, మూల – వేగిస, పూర్వాషాడ – నిమ్మ, నారింజ, ఉత్తరాషాడ – పనస, శ్రవణా నక్షత్రం – తెల్లజిల్లేడు, ధనిష్ఠ – జమ్మి, శతభిషం – అరటి, పూర్వాభాద్ర – మామిడి, ఉత్తరాభాద్ర – వేపతో పాటు రేవతి నక్షత్రం వారు విప్ప మొక్కకు పూజ చేస్తే మంచిదని నమ్మిక.
రాశులు, గ్రహాల వారీగా..
ఇక రాశుల వారీగా మేషం – ఎర్రచందనం, వృషభం – ఏడుకాయల పాయ, మిథునం – పనస, కర్కాటకం – మోదుగు, సింహం – కలిగట్టు, కన్య – మామిడి, తుల – పొగడ, వృశ్చికం – సండ్ర, ధనస్సు – రావి, మకరం – జిట్రేగు, కుంభం – జమ్మి, మీన రాశి వారు మర్రి మొక్కకు పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే, నవగ్రహాల్లో సూర్యుడికి జిల్లేడు, చంద్రుడికి – మోదుగు, కుజుడికి – చండ్ర, బుధ గ్రహానికి – ఉత్తరేణి, గురు – రావి, శుక్ర – అరటి, శని – జమ్మి, రాహువు – గరిక, కేతువు కోసం దర్భ మొక్కలు పూజలు చేశారని అంటున్నారు.
అన్నీ ఒకేచోట..
నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల్లో ఒక్కొక్క దాని కోసం ఒక్కో మొక్కకు పూజలు చేయాలని భావించే వారు ఆ మొక్క ఎక్కడ ఉందో వెదకడం ప్రయాసగా మారుతోంది. ఈ నేపథ్యాన పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో అన్ని రకాల మొక్కలతో వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతీ మొక్క వద్ద పేరు, అందుకు సంబంధించిన రాశి, నక్షత్రంతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పూజలు చేసేభక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో 48 రకాల మొక్కలతో ఏర్పాటు