జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ
బోనకల్: సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శనివారం తనిఖీ చేసిన ఆయన గ్రామంలో జరుగుతున్న ఫీవర్ సర్వేపై ఆరా తీశారు. ప్రతీ ఏఎన్‌ఎం రోజుకు 25 రక్తనమూనాలు సేకరించాలని, ఫ్రైడే – డ్రైడేను పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, డెంగీ, చికున్‌గున్యా, టైఫాయిడ్ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు 0 – 40 ఏళ్ల లోపు గిరిజనులకు సికిల్‌సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు వెంకట్రావు, దానయ్య తదితరులు పాల్గొన్నారు.
చికిత్సలో సిబ్బంది
నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నేలకొండపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన వారితో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం రాత్రి సింగారెడ్డిపాలెం, అమ్మగూడెం, నేలకొండపల్లి నుంచి పలువురు వైద్యం కోసం వచ్చారు. అయితే, విధుల్లో వైద్యుడు, సిబ్బంది సకాలంలో పరీక్షించకుండానే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది. సింగారెడ్డిపాలెంనకు చెందిన చిన్నారిని ముట్టుకోకుండానే ఖమ్మం తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ శనివారం వైద్యులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు వైద్యాధికారి కె.రాజేశ్‌ను వివరణ కోరారు. జిల్లా అధికారుల ఆదేశాలతో వైద్యుడికి షోకాజ్ నోటీస్ అందించనున్నామని తెలిపారు.
యూరియా కోసం
రైతుల ఆందోళన
వైరారూరల్: మండలంలోని పాలడుగు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని సొసైటీ గోదాము శిథిలావస్థకు చేరడంతో యూరియా నిల్వ చేసే పరిస్థితి లేక గ్రామానికి కేటాయించిన మూడు లారీల యూరియాను గొల్లపూడికి తరలించారు. ఇక శనివారం ఒక లారీ లోడ్ యూరియా చేరడంతో తీసుకునేందుకు రైతులు పోటీ పడ్డారు. గతంలో వచ్చిన మూడు లారీల లోడ్‌ను ఎవరికి, ఎప్పుడు పంపిణీ చేశారో చెప్పాలంటూ పెద్దసంఖ్యలో చేరుకున్న రైతులు సొసైటీ సిబ్బందిని నిలదీశారు. గతంలో మూడు లారీలను ఇంకో గ్రామానికి పంపించి, ఇప్పుడు ఒకే లారీ ఇక్కడకు తీసుకొస్తే ఎలా సరిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఒకటి, రెండు రోజుల్లో మరో లారీ లోడ్ యూరియా వస్తుందని సొసైటీ సిబ్బంది సర్దిజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
అన్నిరంగాల్లో వాటా కోసం ఉద్యమించండి
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఖమ్మంఅర్బన్: చైతన్యవంతమైన ఖమ్మంలో యాదవులు ఐక్యంగా ఉంటూ రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో హక్కుల కోసం మిగతా బీసీ వర్గాలతో కలిసి ఉద్యమించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తొలిసారి శనివారం ఆయన ఖమ్మం రాగా, మధురానగర్‌లో తెలంగాణ యాదవ మహాసభ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. గోకులకృష్ణ సేవాసమితి భవనంలో బీసీ, యాదవ విద్యార్థుల కోసం రాయితీపై హాస్టల్ నిర్వహిస్తున్న కూరాకుల నాగభూషణం యాదవ్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సూచించారు. యాదవ మహాసభ జిల్లా అధ్యక్ష, కార్యర్శులు కోడి లింగయ్యయాదవ్, గుమ్మా రోశయ్యయాద వ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భారీ మల్సూర్‌యాదవ్‌తో పాటు చిత్తారు ఇందుమతి, జడ మల్లేశ్, చావలి నాగరాజు, ముక్కాల కమల, కూరాకుల వలరాజు, బండి సత్యం, మూడుముంతల గంగరాజు, ఎర్రబోయిన గోవిందరావు పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల కట్టడి
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల కట్టడి