
కొలువుదీరనున్న కలియుగ దైవం
● టీటీడీ ఆధ్వర్యాన వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కసరత్తు ● ఖమ్మంలో పర్యటించిన టీటీడీ బృందం
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కసరత్తు మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యాన ఖమ్మం పట్టణానికి సమీపాన ఆలయం నిర్మించా లని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీటీడీ చైర్మన్‌ను కోరగా సానుకూల స్పందన లభించింది. ఈమేరకు గురువారం జిల్లాకు వచ్చిన టీడీడీ అధికారులు మంత్రితో సమావేశం కావడంతో పలుచోట్ల అనువైన స్థలాలను పరిశీలించారు. టీటీడీ స్థపతి రవికాంత్ నేతృత్వాన ఎస్‌ఈ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథరెడ్డి, డీఈ నాగభూషణం, ఈఈ రవిశంకర్‌రెడ్డి, ఏఈ జగన్మోహన్‌రావు తదితరులు ఖమ్మం వచ్చారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం తహసీల్దార్లు సైదులు, శ్వేత, ఉద్యోగులు వాహిద్, సత్యనారాయణ, సొసైటీల చైర్మన్లు రావూరి సైదబాబు, తాతా రఘురాంతో కలిసి అల్లీపురంలోని క్రషర్ మిల్ ఏరియా, నేషనల్ హైవే వెంట, రఘునాథపాలెం బైపాస్‌లో నర్సింహ చెరువుగుట్ట, పువ్వాడనగర్ సమీపాన భూములను పరిశీలించారు. సుమారు 15 – 20 ఎకరాల్లో ఆల యం, కల్యాణ మండపం అవసరమని పేర్కొన్న వారు స్థలాల లభ్యతపై ఆరా తీశారు.
రూ.50 కోట్ల వ్యయంతో...
ప్రాథమిక అంచనాల ప్రకారం ఖమ్మంలో రూ.50 కోట్ల వ్యయంతో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మా ణం చేపట్టనున్నట్లు తెలిసింది. ఆలయంతో పాటు కల్యాణ మండపం, గోశాల, యాత్రికుల వసతిగృహాలు ఇందులో ఉంటాయని సమాచారం. కాగా, పలు చోట్ల స్థలాలు పరిశీలించిన టీడీడీ అధికారులు ఖమ్మంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. కావాల్సిన స్థలం, ఆలయ నమూనాపై చర్చించగా.. అనువుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేయాలని మంత్రి వారికి సూచించారు.