
ఇంట్లో దోమలు.. బయట ఈగలు
గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో జనాల అవస్థ
● డ్రెయినేజీలు లేక రోడ్లు, ఖాళీస్థలాల్లోనే నిల్వ ● తాజా వర్షంతో బురదమయమవుతున్న వీధులు ● చెత్త, దుర్వాసనకు తోడు వ్యాధుల భయంతో ప్రజల బెంబేలు
పర్యవేక్షణ లేక..
జిల్లాలో 20మండలాల్లో 571 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అయితే, పాలకవర్గాల గడువు ముగిసి ఏడాదిన్నర దాటడంతో పంచాయతీ కార్యదర్శులే పాలనా బాధ్యతలు చూస్తున్నారు. గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినా వారు నిర్వర్తించే విధులతోనే సరిపోతుండడంతో గ్రామాలను కన్నెత్త్తి చూడడం లేదు. దీనికి తోడు నిధుల లేమి కారణంగా పంచాయతీ కార్యదర్శులు సైతం పారిశుద్ధ్య పనులను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. డ్రెయిన్లు ఉన్నచోట పూడిక తీయక, ట్రాక్టర్లు ఉన్నా చెత్త తరలించడం లేదని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 2వేల కి.మీ. మేర 5,099 డ్రెయిన్లు ఉండగా ఇందులో చాలావరకు పూడిక తీయక ఏళ్లు దాటుతోంది. దీంతో చిన్నపాటి వర్షానికే డ్రెయిన్ల నుంచి నీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా దుర్వాసన మాటేమో కానీ కనీసం వీధుల్లో నడవాలంటే నరకప్రాయంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధులు లేవు...
గ్రామపంచాయతీల్లో చెత్త తొలగింపు, డ్రెయినేజీల వ్యవస్థ సరిగ్గా లేక పలు ప్రాంతాల్లో మురుగు పేరుకుపోయి దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. కనీసం రోజు విడిచి రోజైనా చెత్త తరలించాల్సి ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో నెలలు దాటినా పట్టించుకోవడం లేదు. సిబ్బంది కొరత, నిధుల లేమిని కార్యదర్శులు సాకుగా చూపుడడంతో గ్రామస్తులు ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.
జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రెయినేజీలు లేక మురుగు నీరు రోడ్లపై పారుతుండగా.. ఉన్న చోటా నెలల తరబడి పూడిక తీయక మురుగు రహదారులపైకి
చేరుతోంది. దీనికితోడు సీసీ రోడ్లు లేని ప్రాంతాల్లో వర్షపు నీరు.. మురుగు నీరు కలగలిపి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అంతేకాక దోమలు, ఈగల మోతతో సతమతవుతున్న పలు గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధుల భయంతో బెంబేలెత్తిపోతున్నారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
డ్రెయినేజీలు నిర్మించాలి..
బీసీ కాలనీలో సైడ్ డ్రెయిన్ లేక వర్షపు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈ కారణంగా రాకపోకలకు అసౌకర్యంగా ఉంది. అంతేకాక దోమలు, ఈగలతో జ్వరాల బారిన పడుతున్నాం. డ్రెయినేజీలు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
– షేక్ ఇస్మాయిల్,
ముష్టికుంట్ల, బోనకల్ మండలం
అధ్వానంగా పారిశుద్ధ్యం..
మర్లపాడులో ప్రధాన, అంతర్గత రహదారుల వెంట డ్రెయినేజీలు లేవు. రింగ్ సెంటర్‌లో మురుగునీరు రోడ్లపై చేరి దుర్గంధం వెదజల్లుతోంది. వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశమున్నందున అధికారుల దృష్టి సారించాలి.
– గొర్ల రామ్మోహన్‌రెడ్డి,
మర్లపాడు, వేంసూరు మండలం

ఇంట్లో దోమలు.. బయట ఈగలు