
అర్హులందరికీ న్యాయం చేస్తాం...
● ప్రతీ రహదారి అభివృద్ధి నా బాధ్యత ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఈ విషయంలో ఎవరూ అపోహలకు గురికావొద్దని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేట, 59వ డివిజన్ దానవాయిగూడెంతో పాటు ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు, ఊటవాగుతండా, మంగళగూడెంలో రహదారుల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, ఖమ్మంలో 1, 59, 60వ డివిజన్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశాక మంత్రి మాట్లాడారు. ప్రజల దీవెనలతో ఏర్పడిన తమ ప్రభుత్వం అనేక హామీలను ఇప్పటికే అమలుచేసిందని తెలిపారు. మూడు డివిజన్లలో రహదారుల నిర్మాణానికి రూ.24 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే, పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత రహదారులను కూడా సీసీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
త్వరలోనే రెండో విడత
ప్రస్తుతం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. త్వరలోనే రెండో విడత మంజూరు ఉంటుందని.. ఇలా ఏటా మూడు విడతలుగా ఇళ్లు మంజూరు ద్వారా అర్హులందరికీ న్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో ఎవరు కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాగా, లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపడుతుండగా దఫాల వారీగా బిల్లులు మంజూరవుతాయని పొంగులేటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా ఆర్డీఓ నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, వివిధ శాఖల ఈఈలు కృష్ణలాల్, రంజిత్, పవార్, వాణిశ్రీ, డీఈ మహేష్‌బాబుతో పాటు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.